పాక్ లో డేలైట్ సేవింగ్స్ టైమ్(డి.ఎస్.టి) ఎప్పటినుండి?

30 May, 2008

పాకిస్తాన్ లో జూన్ ఒకటినుండీ డి.ఎస్.టి పద్ధతి మొదలుతుందట. అంటే అమెరికా,కెనడాల్లో లాగ సూర్యుడు తొందరగా వచ్చే మాసాల్లో గడియారాన్ని ఒకగంట వెనక్కి జరుపుతారు. దానివలన కార్యాలయాల్లో సాయంత్రంపూట విద్యుత్ ఆదాఅవుతుందని ఒక అభిప్రాయం. అయితే ఈనాడు లో చెప్పినట్టుకాక ఈ డి.ఎస్.టి పద్దతి 2002 వ సంవత్సరం నుండే అమల్లో వుందని బి.బి.సి అంటోంది. దీనికి సపోర్టు గా టైమ్ ఆండ్ డేట్ లో ఉన్న పట్టికను చూడండి. కానీ డిటీ అనే సైట్ లో ఈనాడు చెప్పినట్టేఉంది. మరికొన్ని సైట్ లలో 2002 లో ఒకసారి టెస్ట్ చేసి మానేశారని ఉంది. పాకిస్తాన్ గురించి, ఈ విషయం గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇక్కడ కొంచెం అప్‍డేట్ చెయ్యగలరు.

పూర్తి టపా చదవండి!

రాజశేఖర్ ఆఫీస్ పై అగంతకుల దాడి(?)

అది నిజమేనా? అయితే ఎంతవరకూ? నిన్న రాత్రి సినిమా యాక్టర్ రాజశేఖర్ ఆఫీస్ పై దాడిచేసి అందులో ఉన్న ఆయన కొత్త సినిమా తాలూకూ పేపర్లని, సి.డీ లని తగులబెట్టారుట. దొంగతనానికి వచ్చిన వారైతే కేవలం డబ్బు దోచుకుని పోతారు కానీ సినిమా స్క్రిప్ట్, సి.డి లను ఎందుకు తగుల బెడతారని జీవితా రాజశేఖర్ లాజిక్కు లాగారు. అంతేగాక కొంతకాలం క్రితం తమపై దాడి చేసిన చిరంజీవి అబిమానులకు దీనితో సంబంధం ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేసారు. నేడు ఇంటిపై దాడి చేసిన వారికి రేపు తమ పిల్లలపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని ఆక్రోశించారు. ఒక తల్లిలా ఆలోచిస్తే ఆవిడ బాధ మను అర్ధమవుతుంది. కానీ అది కన్న తల్లి ఆక్రోశమేనా లేక ఒక రాజకీయ మేధావి ఆలోచనా?

ఈ విషయంలో రాజశేఖర్/జీవిత లు మొదట్నుండీ కూడా పక్కా రాజకీయ నాయకుల్లాగ వ్యవహరిస్తున్నారేమో నన్న అనుమానం నాకుంది. చిరంజీవిపై అవాకులూ చెవాకులూ పేలినందుకు మొన్న కొందరు ఆయన కారుపై దాడి చేసారు. జీవిత మరియు రాజశేఖర్ లు దానినుండి రాజకీయ లబ్ది (పొలిటికల్ అడ్వాంటేజ్) పొందేలోపే దూరదృష్టి కల చిరంజీవి వెంఠనే వెళ్ళి సారీ చెప్పారు. అప్పుడు కూడా జీవిత తన పిల్లల క్షేమం పట్ల అనుమానం వ్యక్తం చేశారు, ఒకసారి గుర్తుతెచ్చుకోండి. నేడు మళ్ళీ అదే కూత. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ రాజశేఖర్ మీదో మరొకరిమీదో దాడిజరగడం, వాళ్ళు పెద్దలొల్లి చేయడం దేనికి చిహ్నం?

మీకొక సినిమా కధని గుర్తు చేద్దామనుకుంటున్నాను. "ఆవిడే శ్యామల" సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తున్నాడుకదా. అతను ఒక ప్రతిపక్ష రాజకీయనాయకుడిని కలిసి అతను అధికారంలోకి రావడానికి సలహాలిస్తుంటాడు. ఒక అమాయకుడైన కార్యకర్త చేత ఆమరణదీక్ష చేయించి, చివరలో ఆదీక్షా శిబిరం మీద మనమే ఒకబాంబుదాడి చేసి, దానిని ప్రభుత్వం మీద నెట్టేస్తే, మనకు సింపతీ ఓట్లు, అధికారం దక్కడం ఖాయం అని చెబుతాడు. ఎవరూ దొరక్క చివరికి ప్రకాష్‍రాజ్ నే దీక్షకి కూర్చో పెడతారు. కానీ ఆ నాయకుడు సింపతీకోసం నిజంగానే తనపై బాంబుదాడి చేసి చంపేయాలని చూస్తున్నారని తెలిసి శిబిరం లోంచి పారిపోతాడు.

జీవిత రాజశేఖర్ గారూ, పైన తధాస్తు దేవతలుంటారంటారు, దయచేసి మీ పిల్లల్ని ఈ రాజకీయ ఊబిలోకి లాగి తద్వారా లబ్ది పొందుదామనుకోవద్దు. ఆధారాలు లేని ఆరోపణలు మంచిదికాదు. ఈ పని ఎవరు చేశారో పోలీసులు , కోర్టులు నిర్ణయిస్తారు. ఇలా అనవసంగా చిరంజీ్విపై అనుమానం వ్యక్తం చేయడం వలన రేపు నిజంగా చిరంజీవిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న 'అధినేతలకు' మీ పిల్లలే ఒక ఆయుధం కావొచ్చేమో! ఆలోచించండి

పూర్తి టపా చదవండి!

తెలుగు పాత వార్తాపత్రిక చదవాలంటే...

29 May, 2008

మీకందరికీ తెలుసు ఈనాడు కానీ, సాక్షి లేదా ఆంధ్రజ్యోతి లాంటిపేపర్ ల పాత ఎడిషన్ చూడాలంటే ఏంచేయాలో. మీకు తెలుసని నాకు కూడా తెలుసు కానీ ఈ టపా ఎందుకు రాస్తున్నానంటే ఈనాడులో మీకు తెలియని ఒక ట్రిక్ చెప్పడానికి అంతేగాక ఇందాక నా బ్లాగు ఎనాలసిస్ చూస్తున్నప్పుడు ఈరోజు కొందరు గూగుల్ లో పాత ఎడిషన్ కోసం వెతుకుతున్నట్టుగా చూపించింది. దానిమీద ఒక టపా ఎందుకు రాయకూడదనిపించింది. ఇది మీలో కొందరికైనా ఉపయోగపడితే సంతోషం.

ఈనాడు మొదట్లో తన వెబ్ ఎడిషన్ లో ఒక వారం క్రితం పేపర్లను మాత్రమే చూడనిచ్చేది. కానీ ఆ తరువాత గత 90 రోజుల పాత పేపర్ లను చూడడానికి అనుమతించడం మొదలెట్టింది. దీనికోసం ఈనాడు సైట్ కి వెళ్ళి పైన నీలి రంగు పట్టీలో ఉన్న ARCHIVES అనే పదం మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత వచ్చిన పేజీలో నుండి కావల్సిన తారీఖుమీద నొక్కితే మీకు కావల్సిన పాత పేపర్ చూపెడుతుంది.

ఆంధ్రజ్యోతి ఒక వారం పాతపేపర్లను చూడడానికి అనుమతిస్తుంది. ఆంధ్రజ్యోతి సైట్ కి వెళ్ళి అన్నిటికన్నా పైనున్న వరుసలో ఉన్న Archives అనే లింక్ మీద నొక్కాలి. ఆ తరువాత వచ్చిన పేజీలో నుండి కావల్సిన తారీఖుమీద నొక్కితే మీకు కావల్సిన పాత పేపర్ చూపెడుతుంది.

సాక్షి కూడా పాత సంచికలను చూడనిస్తుంది అయితే ఎన్ని రోజుల పాత పేపర్ చూడొచ్చో ఆ సైట్ లో ఇవ్వలేదు. సాక్షి సైట్ కి వెళ్ళి అన్నిటికన్నా పై వరుసలో ఉన్న పాత సంచికలు అన్న లింక్ మీద నొక్కాలి. ఆ తరువాత వచ్చినపేజీలో ఉన్న క్యాలెండరు నుండి మనకు కావల్సిన తారీఖు ను ఎంచుకొని పక్కనున్న బటన్ ని నొక్కితే మనకు కావల్సిన పాత పేపర్ చూడొచ్చు.

ఈనాడు ట్రిక్: ఒక ట్రిక్ ని ఫాలో అవ్వడం ద్వారా ఈనాడు లో మనం 90 రోజులకన్నా ఎక్కువ రోజుల్లోని పాతపేపర్ ని చూడొచ్చు. ఈరోజు నేను ఆర్కైవ్ మీద నొక్కినప్పుడు పక్కనున్న బొమ్మ చూపించింది. అంటే నేను ఫిబ్రవరి 29 నుండి నేటి వరకూ పాత పేపర్ ను చూడవచ్చు. కానీ మీ బ్రౌజర్ లో ఉదాహరణకి http://www.eenadu.net/archives/archive-1-2-2008/home.asp అనే అడ్రస్ టైప్ చేయండి. అప్పుడు నేను ఫిబ్రవరి ఒకటి నుండి నేటి వరకూ పాత పేపర్ చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా కొన్ని రోజుల వెనుక పేపర్లనుకూడా మనం చదవవచ్చు.

ఆంధ్రజ్యోతి ట్రిక్:అలాగే ఆంధ్రజ్యోతి ఒకవారం కంటే పాత పేపర్ కావాలంటే ఆ ఆడ్రస్ లోని తారీఖుని మార్చితే సరి అంటే ఉదాహరణకి http://www.andhrajyothy.com/archives/archive-2008-5-7/index.asp ఆడ్రస్ ద్వారా జ్యోతిలో గరిష్టంగా ఈ పద్ధతిలో మూడువారాల పేపర్ ని చూడొచ్చు.
గమనిక: మీరు కొన్ని రోజుల తరువాత ఈ ట్రిక్ ట్రై చేస్తే అడ్రస్ లోని తారీఖుని కూడా అదే నిష్పత్తిలో మార్చాలి. నేనీ టపా రాసేసమయానికి ఈ ట్రిక్స్ పనిచేస్తున్నాయి. ఈ టపా చూసి వాళ్ళు ఈ ఫీచర్ ని తీసేయవచ్చేమో కూడా! మీకు ఈ ట్రిక్ పనిచేసినా చెయ్యకపోయినా క్రింద కామెంట్లో చెప్పండి.

పూర్తి టపా చదవండి!

యధా రాజా, తధా మంత్రి

మొన్న ఎమ్.ఆర్.పి.ఎస్ రౌడీయిజాన్ని చూసింతర్వాత మళ్ళీ ఇదిగో తరువాతి రోజునే అంటే నిన్న రాత్రి టీ.వీల్లో మరియు ఈ రోజు పేపర్ లలో మంత్రి ముఖేశ్ రౌడీయిజాన్ని చూసింతర్వాత ఎలా స్పందించాలో అర్ధంకావడంలేదు. ఒకప్పుడు టి.వీ కెమెరాలకి ఈ నాయకులు భయపడేవారు, గతకొన్నేళ్ళనుండీ దానికీ భయపడడం మానేశారు. డబ్బు పంచడమే ఓ పెద్ద నేరం దానికితోడు రెడ్ హ్యాండెడ్ గా అదికూడా మీడియా చూస్తుండగానే దొరికిపోయాకకూడా ఏమాత్రం జంకుగొంకు లేకుండా రౌడీయిజానికి పాల్పడడం దేన్ని సూచిస్తుంది? రాజాంతర్యాన్నెరిగిన పోలీసులు కూడా తమ శక్తి కొద్దీ ముఖేశ్ సేవ చేసుకున్నారు. ఒక పార్లమెంటేరియన్ అని కూడా చూడకుండా సి.పి.ఎం ఎమ్.పి మధుని ఇష్టానుసారం తిట్టడం, కొట్టడం ఏ సంస్కృతికి నిదర్శనం? అసలిలాంటివాళ్ళ మీద ఎలక్షన్ కమీషన్ కొరడా ఝుళిపించాలి, ఎమ్.ఎల్.ఏ పోస్టు నుంచి డిస్మిస్ చేసి మళ్ళీ ఎలక్షన్ లలో నిలబడకుండా నిషేధించాలి. రాజెలా వుంటే మంత్రులూ అలాగే వుంటారు తద్వారా ప్రజలూ అలాగే మారతారు. వీళ్ళతప్పేం లేదన్నట్టు అప్పుడే ప్రచారాం కూడా మొదలయ్యిందట. కరపత్రం సాక్షిగాడైతే ఓ మెట్టెక్కి విపక్షాలు ముఖేశ్ వియ్యంకుడి ఇంట్లోకి తరువాత బెడ్ రూములోకెళ్ళి విధ్వంసం సృష్టించారని రాశాడు కానీ దాని ఫోటోలు మాత్రం వెయ్యలేదు(అవి తయారవుతున్నాయ్, నెమ్మదిగా వస్తాయిలేండి). ఎలక్షన్ ముందురోజు మంత్రి రౌడీయిజం, ఎన్నికల్లో ఎలా పరిణమిస్తుందో? లోక్ సత్తా సిద్ధాంతాల వ్యతిరేకులూ... మీరేమంటారు?

పూర్తి టపా చదవండి!

అమృత విలాస్ లో చేదెక్కుతున్న అమృతం

28 May, 2008

ప్రక్క లోగో చూడగానే మీలో చాలా మందికి ఈపాటికే అర్ధమైపోయుంటుంది నేను దేనిగురించి చెబుతున్నానో. ఒకప్పుడు జెమినీ టి.వీ లో ప్రతీ ఆదివారం రాత్రి 8:30 గంటలకి ప్రసారమై అందరి అభిమానాన్ని (కనీసం నా అభిమానాన్ని) సంపాదించుకున్న ఈ సీరియల్ ఒక కామెడీ సీరియల్. కేవలం నాలుగు ముఖ్య క్యారెక్టర్ లు తో ఏ వారానికి ఆవారం కధ ఐపోయేలా వచ్చిన ఈ సీరియల్ నాకు నచ్చేది. అప్పుడప్పుడూ వాళ్ళ భార్య కేరక్టర్ లు కూడా ఎంటరయ్యేవి. ఒక బడుగు హోటలోడు త్వరగా ధనవంతుడవ్వడానికి తనమిత్రుడితోకలిసి చేసే పనులే ఈ కధ యొక్క థీమ్.

అమృతరావ్ క్యారెక్టర్ లో ఇద్దరు నటులు (ఒకరు గుర్తులేదు, రెండవవాడు సినిమా యాక్టర్ నరేష్) మారి చివరగా హర్షవర్ధన్ సెటిలయ్యాడు.
అంజి గా పిలవబడే ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు శహభాష్ అనిపించాడు.
సర్వం గా పిలవబడే సర్వేశ్వర్రావు పాత్ర నటుడు ఎవరో తెలియదు
నాల్గవవాడు అప్పాజి, ఈయన అసలుపేరూ నాకు తెలియదు. ఈయన ఈ హోటలున్న ఇంటికి ఓనర్

మొత్తం సీరియల్ బ్రహ్మాండం అని చెప్పలేను కానీ 80 శాతం ఎపిసోడ్ లు మాత్రం వీర సూపర్ గాఉంటాయి. ఈ సీరియల్ ని ఎందుకనో జెమినీలో త్వరగా, హడావిడిగా ముగించేసారు అనిపించింది. ఇదే సీరియల్ మళ్ళీ మాటి.వి లో మొదలయింది. ప్రస్తుతం మా లో వచ్చేది రీమేక్ అనుకుంటా ఎందుకంటే ఈ ఎపిసోడ్లు జెమినీలోవచ్చినప్పుడు నేను చూసిన గుర్తులేదు ముఖ్యంగా నరేష్ నటించినవి. సినిమా హీరో నరేష్ అమృతంగా మిగిలిన క్యారెక్టర్ లలో మార్పులేకుండా మా’లో వస్తుంది. మొన్న ఆదివారమో సోమవారమో అనుకుంటా వచ్చిన ఒక ఎపిసోడ్ లో నరేష్ నటన మీరెవరైనా చూశారా? నరేష్ అందులో ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడు, ఐదు నిమిషాల సీను. దీన్ని చూసినవారెవరికైనా Mr. బీన్ "Bean Taking The Exam" సీన్లు గుర్తురాకమానవు. బీన్ సీరియల్ ని తెలుగులోకి డబ్ చేస్తే ఇలా ఉంటుందో అలాగే మక్కికి మక్కి నటనని కాపీ చేశాడు. చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. నరేష్ లాంటి మెచ్యూర్డ్ నటుడికి ఇది అవసరమా ఆఖరికి సీరియల్స్ లో కూడా? నాకుమటుకూ దీంట్లో నరేష్ ఓవరేక్షన్ చేస్తున్నట్టుంది. ఈయనకన్నా హర్షవర్ధనే బాగా చేసాడు. కడివెడు అమృతంలో ఒక విషపుచుక్కపడ్డా, అది ఇదవుతుందన్నట్టు ఇలాంటి కాపీకొట్టుడు సీన్లే ఈ సీరియల్ ని దెబ్బకొడతాయి. పాత అమృతానికి సంబంధించిన వీడియోలు అంతర్జాలంలోకూడ లభిస్తున్నట్టున్నాయి. గూగుల్ కెళ్ళి "Amrutham Gemini Serial" అని టైప్ చేస్తే కావల్సిన లింకులొస్తాయి.
Update-30 మే 2008: ఈ సీరియల్ కి సంబందించిన 40 ఎపిసోడ్ ల వీడియోలు తెలుగు కామెడీ క్లబ్ ద్వారా

పూర్తి టపా చదవండి!

లోక్‍సత్తాకి ఎన్ని "ఓట్లొ"స్తాయి?

ఎన్ని ఓట్లా? ఎన్ని సీట్లు అనబోయి ఎన్ని ఓట్లు అన్నానేమో అనుకుంటున్నారా లేక అచ్చుతప్పేమో అనుకుంటున్నారా? అదేంకాదు, నేనన్నది, మీరు చూసింది రెండూ కరక్టే. సిద్ధాంతాలు, ఆవేశాలు అన్నీ కొంచెంసేపు పక్కనబెట్టి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. అత్యద్భుతం జరిగితే తప్ప ప్రస్తుతం లోక్‍సత్తాకి సీట్లు గెలిచే కెపాసిటీ లేదన్నదీ అందరూ అంగీకరించే సత్యమే. కానీ లోక్‍సత్తా ఈ తెలంగాణా ఎన్నికల్లో నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టింది. వాళ్ళుకూడా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఏదో ప్రచారం లాంటిది చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఈ నలుగురికీ కలిపి ఎన్నిఓట్లు రావొచ్చని మీరనుకుంటున్నారు. పక్కనున్న ఓటుబాక్సులో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ఓటుతో పాటు బ్లాగ్లోకానికి ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఎలాగూ కామెంటు సెక్షను ఉందికదా.

పూర్తి టపా చదవండి!

ఆంధ్రజ్యోతి పై ఎమ్.ఆర్.పి.ఎస్ గూండాగిరి

27 May, 2008

గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నారు. నిన్న ఆంధ్రజ్యోతిలో "బాడుగ నేతలు" శీర్షికతోవచ్చిన వార్తకి రెచ్చిపోయిన ఎమ్.ఆర్.పీ.ఎస్ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడిగా జ్యోతి కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం చేసారు. అడ్డువచ్చిన సిబ్బందిని అందరినీ విరగబాది, కార్యాలయానికి నిప్పంటించి వీరంగం చేసారు, పచ్చి గూండాలను తలపించారు. ఆకధనంలో కేవలం ఎమ్.ఆర్.పి.ఎస్ నే కాదు, దళితుల పేర్లు చెప్పుకుని ఆ వర్గాన్నే మోసంచేస్తున్న ఊసరవెల్లులందరిగురించీ వుంది. మరి వీళ్ళకే ఎందుక్కాలిందో? ఆకధనం వలన వారికి బాధ కలిగుంటే ప్రజాస్వామికంగా నిరసనతెలపాలి కానీ ఏంటిది? గూండాలకూ వీళ్ళకీ ఏమైనా తేడా వుందా? పైగా ఈసాయంత్రం లోపు జ్యోతి ఎం.డి రాధాక్రిష్ణ క్షమాపణ కోరకపోతే వాళ్ళంతు, వాళ్ళపేపరంతు చూస్తామని బెదిరిస్తాడా? చేసిన వెధవ పనిని సమర్దించుకోవడమేకాక ఇది అగ్రవర్ణాలవారు (ఎందుకంటే రాధాక్రిష్ణ అగ్రవర్ణమట) దళితజాతిమీద చేసినకుట్రగా అభివర్ణిస్తాడా? ఏమన్నా సంబంధం ఉందా? అవునుమరి అలా రెచ్చగొట్టకపోతే రేపటినుండీ రాజకీయపార్టీలదగ్గర వీడి పప్పులు ఉడకవుకదా! దీనివెనుక అధికార పార్టీ కుట్రుందని రాధాక్రిష్ణ అంటాడు, ఏమో నిజమేనేమో! ఆంధ్రజ్యోతి రిసెప్షనిస్ట్ అదృష్టవశాత్తు బ్రతికిపోయింది గానీ ఈ గూండాలు ఆ అమ్మాయినికూడా పెట్రోలుపోసి తగలపెట్టివుంటే? గుంపుమనస్థత్వం ఎలా వుంటుందో ఎవరికితెలుసు ఆమధ్య ముంబాయిలో న్యూఇయర్ రోజున ఒకగుంపు ఇద్దరమ్మాయిలని ఎలా టీజ్ చేసిందో మీకు ఇంకా గుర్తుందికదా.





ఈ విషయం మీద మిగతా పత్రికల్లో వచ్చిన వార్తల్ని సాక్షిలో వచ్చిన వార్తని పోల్చి మీకేమైనా తేడా కనపడుతుందేమో చూడండి. మిగతాపేపర్లన్నీ ఇది పత్రికా స్వేచ్చమీద, మీడియామీద దాడి అంటుంటే, సాక్షిమాత్రం ఆమాట రాధాక్రిష్ణ చెపుతున్నట్టుంది. అంతేకాక కొన్ని చోట్ల ఆంధ్రజ్యోతిని కార్నర్ చేయాలనుకుంటున్నట్టుగా అనిపించింది. వివాదం సంగతెలాఉన్నా ఈ ఉదంతంతో కొన్ని రోజులపాటు తగ్గిన జ్యోతి సర్క్యులేషన్ సాధారణానికి రావడం ఖాయం, ఏమంటారు?

పూర్తి టపా చదవండి!

ఆయన వస్తానన్నాడుగా! మీ బాధేంటి?

26 May, 2008

డైరెక్టుగా ఆయన చెప్పకపోయినా సన్నిహితులచేత చెప్పిస్తున్నాడు. సొంత తమ్ముడుకూడా మొన్నామధ్యనే అమెరికా సభలో ఈవిషయం మీద ప్రామిస్ కూడా చేసాడు. మహిళా సంఘాలకు సంబంధించిన శిక్షణాతరగతులు జరుగుతున్నాయని తెలుగు పేపర్లు కూడా వారానికో న్యూస్ వేస్తున్నాయి. ఆయన అంగరక్షణకు ప్రత్యేకంగా కొంతమంది విశ్వాసపాత్రులకు ట్రైనింగునికూడా ఇస్తున్నట్టు కొన్నాళ్ళక్రితం ఒక పేపర్ ఫోటోలతో సహా కధనం ప్రచురించింది. పేరు ఖరారైందని, చెన్నైలో పాంప్లేట్లు ముద్రిస్తున్నారని ఇలా అంతా పాజిటివ్ గానే చెబుతున్నారు. ఆయనకూడా మరికొన్ని నెలల్లో మంచిముహూర్తం చూసుకుని తన నోటిద్వారా తనే ఆ విషయం చెపుతాన్నారు. మధ్యలో వీళ్ళగొడవేంటో తెలియడంలేదు. నాకుకూడా ఆయనంటే అభిమానమే అదికూడా నటుడిగా కాదు కేవలం ఒక సంఘసేవకుడిగా మాత్రమే. ఎప్పుడో ఒకసారైతే పర్లేదు, రోజుకొకరు ఒకచిన్న గుంపును తయారుచేయడం ఆయనరాజకీయాల్లోకి రావాలంటూ రోడ్లెక్కడం తద్వారా టీ.వీలు/పత్రికలకెక్కడం. ఆయన రానంటే ఇవన్నీ అవసరమేమో (ఎవరి స్వేచ్చ వారిది, ఆయన రానంటే బలవంతపెట్టే హక్కు ఎవరికుంది) గానీ నేనొస్తానుమొర్రో అంటుంటే వీళ్ళకేం బాధ. వీళ్ళు నిజంగా అభిమానించేవారా లేక ఆ ముసుగులో అందలాలెక్కుదామనే రాజకీయ ఊసరవెల్లులా? ఆ నోట ఈ మాట వచ్చేదాకా ఆగలేరా?

పూర్తి టపా చదవండి!

రాజకీయ హెచ్చరిక: 'గాలి' తుఫాన్ లా మారబోతోంది

మొత్తానికి కర్ణాటకానికి శుభం కార్డు పడింది. కొద్దిగా అటూఇటూ గా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బి.జె.పి సాధారణ మెజార్టీతో గెలుపొందింది. భాజపా కి ఇంత బలం రావడానికి సెంటిమెంటు ప్రధాన కారణమేఅయినా దానితోపాటు ఒక అవకాశం ఇచ్చిచూద్దామన్న ప్రజల ఉద్దేశం కూడా ఒక కారణమే. నా ఉద్దేశం ప్రకారం భాజపాకి మరో 5 సీట్లు వచ్చేయే కానీ చాలా చోట్ల కాంగ్రేస్, జేడీఎస్ కుమ్మక్కవడం వలన ఆ వోట్లు మిస్సయింది. జాతీయ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయంవున్న ఈ తరుణం లో కీలకమైన మరో రాష్ట్రం చేజారడంతో కాంగ్రేస్ లో అయోమయం ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఇక మన "సాక్షి" కొన్నాళ్ళ క్రితం చెప్పిన పోల్ ప్రిడిక్షన్ లో కాంగ్రేస్ కి 120 సీట్లు గ్యారంటీ అన్నదాని గురించి మాట్లాడడం అనవసరం.

కాంగ్రేస్ పరిస్థితి ఎలా ఉన్నా మన వై.ఎస్.ఆర్ గారు మాత్రం చాలా ఖుషీ గా ఉండుంటారు. ఎవరైనా సొంత పార్టీ వాళ్ళు గెలవాలనుకుంటారు కానీ పైకి ఎన్ని కబుర్లుచెప్పినా వై.ఎస్.ఆర్ గారు మాత్రం లోపల్లోపల కాంగ్రేస్ ఓడిపోవాలని (బళ్ళారిలో మాత్రం) కోరుకునుంటారు. ఎందుకంటే ఆయన ప్రియ మిత్రులు "గాలి"సోదరులు ఎప్పటిలానే బళ్ళారిలో భాజపా తరపున పోటీ చేస్తున్నారు. సొంతపార్టీవాళ్ళ పోరు తద్వారా సోనియాగారు వెనకాలనుండి పెడుతున్న వాతలకు తట్టుకేలేక ఆయన బళ్ళారివచ్చి కాంగ్రేస్ కి అనుకూలంగా ప్రసంగించారు కానీ చిత్తశుద్ది లేని శివపూజ ఎందుకండి? రాహుల్‍గాంధీ దళితవాడల్లో తిరిగింతర్వాత ’ప్రత్యేక’సబ్బుతో స్నానం చేసినట్టు (మాయ చెప్పిందీ... ఐ విట్నెస్ ఎవరో?) మన వై.ఎస్.ఆర్ గారు ఈ బళ్ళారి మొక్కుబడిమీటింగ్ తర్వాత కాంగ్రేస్ ఓటమికోసం, గాలి సోదరుల గెలుపుకోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయించారని ఇక్కడ జనాలు చెవులుకొరుక్కుంటున్నారు.

కర్ణాటకలో భాజపాయేతర ప్రభుత్వాలున్నప్పుడే గాలి సోదరుల హవా కర్ణాటకలోనే కాక ఆంధ్రప్రదేశ్ అంతటా నడిచింది. ఎంతలా అంటే... ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రిని, ప్రతిపక్షనాయకుడ్ని బండబూతులు తిట్టే కెపాసిటీ అధికారపార్టీనాయకుడి తరువాత ఈయనఒక్కడికే సొంతం. ఇంకా, వచ్చే ఎన్నికల్లో టి.డి.పి ని మట్టికరిపిస్తానని శపధం కూడా చేసాడు. ఇప్పుడు కర్ణాటకలో భాజపా ప్రభుత్వమే ఏర్పడబోతోంది. ఇక ఈ ’గాలి’ తాకిడి కాస్తా తుఫాన్‍లా మారి ఆంధ్రప్రదేశ్ ని ఏంచేస్తుందో?
ఆకాశవాణి హెచ్చరిక: కర్ణాటకలో ఏర్పడిన ఈ అధికపీడనం సాధారణ గాలిని, తుఫానులామార్చి ఆంధ్రప్రదేశ్ విపక్షులమీద విరుచుకుపడబోతోందని ఆకాశవాణి హెచ్చరించింది.

పూర్తి టపా చదవండి!

అక్షరాల్లో నా కార్టూన్

24 May, 2008

అదేంటి కార్టూన్ గీతల్లో కదా ఉండేది, అక్షరాల్లో వుండడం ఏంటి అనుకుంటున్నారా? నేను కూడ కార్టూన్ వెయ్యడం నేర్చుకుందామని చాన్నాళ్ళనుండి అనుకుంటున్నాను. కానీ ఇప్పట్లో కుదిరేలా లేదు. దానికి సవాలక్ష కారణాలు. పోనీ ఎలాగోలా కొడదామంటే ఈ విషయానికి ముఖంలో భావం లేకపోతే బాగోదు. అందుకనే మనసులో కార్టూన్ పురుగు తొలిచినప్పుడల్లా దానిని దాచుకోకుండా కక్కేయడానికి ఒక సులభమార్గం కనిపెట్టాను. అదే కార్టూన్ థీమ్. అంటే నా మనస్సులో కార్టూన్ ఎలా వుండాలనుకున్నానో దానిని వర్ణించిచెప్పడం. ఔత్సాహికులకు ఎవరికైనా నచ్చితే ఆ థీమ్ తో బొమ్మ వేసుకోవచ్చు.

ప్రస్తుత బ్లాగ్వనంలో నలుగుతున్న విషయం సాక్షి గురించే. అందుకనే నా మొదటి కార్టూన్ (నా బ్లాగులో చివరిది కాకూడదని నా ప్రార్ధన) సాక్షిగురించే.

ఈ మధ్య సాక్షి ఏదినిజం పేరుతో ఈనాడుని చీల్చి చెండాడుతుంది కదా. మొన్నామధ్య పోలేపల్లి సెజ్ గురించి, నిన్న అదేదో ఆహార ఉత్పత్తి గురించిన నివేదికగురించి. భవిష్యత్తులో రాబోయే మరికొన్నింటి గురించి... ఇక నే మొదలెడతాను... మీరు ఊహించుకోండి...

ఒక గదిలో ఒక కుర్చీ మరియొక బల్ల, బల్ల మీద వెలుగుతున్న టేబుల్ లైటు.
ఆ కుర్చీ మీద కూర్చుని ఒకవ్యక్తి కునికిపాట్లుపడుతూ ఈనాడు పేపర్ చదువుతుంటాడు, ఆయన కళ్ళు సగం నిద్రతో మూసుకుని, సగం తెరచుకొని ఉంటాయి (అరమోడ్పు కనులన్నమాట)
ఆ బల్లకి నలువైపులా పేపర్లు దొంతర్లు దొంతర్లుగా పేర్చి ఉంటాయి, ఆ దొంతర్లు దాదాపు పైకప్పుని తాకుతుంటాయి.
గుమ్మం దగ్గర ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఈ విధంగా అంటుంటాడు "మన జగన్ గారే సార్, గత పదేళ్ళ ఈనాడులో తప్పుల కోసం వెతుకుతున్నారు"

పూర్తి టపా చదవండి!

ఇది భారీసైజు ఆవా లేక ఎద్దా?

23 May, 2008

నిజానికి నాకూ గందరగోళంగా ఉంది. ఆవుల్లో ఆడ ఆవులూ, మగ ఆవులూ వుంటాయా? నా ఉద్దేశం ప్రకారం ఇది ఎద్దే ఎందుకంటే పొదుగు కనబడడంలేదు. కానీ ప్రపంచం అంతా దీన్ని ఆవు అంటున్నారు (కొమ్ములు లేవనా?) కాబట్టి నేనూ అదే అననా? ఇది ఏదో మీరే చెప్పండి. దీని ఎత్తు ఆక్షరాలా ఆరడుగులా ఏడంగుళాలంట. వీటి జాతిలో ప్రస్తుతం ఇదే నెంబర్-2. బ్రిటన్ లో మటుకూ ఇదే నెంబర్-1. ప్రపంచ నెంబర్-1 కి దీనికీ వున్న తేడా కేవలం ఒక అంగుళమే. అయితే ఇది ఇంకా ఎదిగే వయసులోనే ఉంది కాబట్టి త్వరలోనే గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం లభించవచ్చు.

ఇది ఇంతకీ ఆవా లేక ఎద్దా అన్నవిషయం గురించి చర్చ జరుగుతున్నది డెయిలీమెయిల్ అనే యూ.కె వెబ్ సైట్ లో. పక్క బొమ్మ కూడా అక్కడినుండే. మరిన్ని విషయాలకు ఆ సైట్ చూడండి.
ఆ! మరో విషయం చెప్పడం మరిచాను, అక్కడ ఇచ్చిన కామెంటలలో మజీద్ అనే వాడు ఇచ్చిన కామెంట్ చూడండి. నీ అవ్వారేడవ్వా!(దీనికి మీనింగేదీలేదు) ఇండియా వాళ్ళెంత చీపయ్యారురా నీకు. వీడు ఖచ్చితంగా పాకిస్థాన్ వాడేనని నా గట్టి నమ్మకం

This cow should be sent to India to be worshipped BIG TIME!

- Majid, Australia, 13/5/2008 14:37

పూర్తి టపా చదవండి!

మార్కెట్ మాయ: ఒక్క రోజులో కోటీశ్వరులుయిన అదృష్ఠవంతులు

షేర్ మార్కేట్, ట్రేడింగ్: అంతా మాయ. లాభాలు, నష్టాలు మనతో దోబూచులాడే దొంగాట ఇది. ఒకరు లాభపడాలంటే వేరెవరో నష్టపోవాల్సిందే, వెంఠనే కాకపోతే కొంచెంలేటుగా అయినాసరే, ఇదే స్టాక్ మార్కెట్ లాజిక్కు . నష్థపోయినా తట్టుకునే వాళ్ళే ఇక్కడికి రావాలి. గత రెండేళ్ళనుండీ ట్రేడింగ్ చేస్తున్నాను. ఏదో మరీ లక్షల్లో కాకపోయినా గత రెండేళ్ళమీద చూసుకుంటే స్టాక్ మార్కెట్ నుండి ఒక లక్షదాకా పిండుకున్నానేమో. కానీ ఈ న్యూస్ విన్నదగ్గరనుండి నాలోని షేరాత్మ గోల పేడుతున్నాడు, ఈ భాగ్యం నాకుదక్కలేదని ఒకటే లొల్లి. విషయం ఏంటంటే...

బోంబే స్టాక్ ఎక్సేంజిలో కె.జి.ఎన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ మొన్న అంటె బుధవారం రీలిస్టయింది. ఈ షేరు ఏవో కారణాలచేత ఏడేళ్ళక్రితం డీలిస్ట్ అయింది అంటే అప్పటినుంది ఈ షేర్ ని మార్కెట్ లో కొనలేం లేదా అమ్మలేము. ఆ కంపెనీ షేర్ లున్న వాళ్ళు పడిన బాధ ఇదిగో మళ్ళీ మొన్నట్రేడ్ మొదలవడంతో పోయింది. వాళ్ళ పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడట్టయింది. బుధవారం ఉదయం 72రూపాయల దగ్గర మొదలయిన షేరు ధర 55000 (అక్షరాలా యాభైఐదు వేల) రూపాయలవరకూ వెళ్ళింది. సాధారణంగా ఏదైనా కంపెనీ కొత్తగా ఎక్సేంజి లో లిస్టయినా లేదా రీలిస్టయినా వాటికి ఎక్సేంజి "ఫిల్టర్ని" ఉంచదు. ఫిల్టర్ అంటే ఒక లిమిట్, అంటే ఒక షేర్ ఒకరోజులో అత్యధికంగా/అత్యల్పంగా ఎంత ధర ఉండొచ్చు అని చెప్పేది. ఈ లిమిట్ దాటితే ఇక ఆరోజుకి ఆ షేర్ ని అమ్మడం/కొనడం చేయలేం. ఉదయం ఎవరైనా ఈ కంపెనీ 100 షేర్ లని 72 రూపాయలదగ్గర కొనుక్కున్నా మధ్యాహ్నానికి లేదా తరువాత రోజైనా అమ్ముకుంటే అరకోటీశ్వరుడే.

మరీ ఇంత కాకపోయినా మరో పెన్నీ స్టాకు సిఫ్ టెక్నాలజీస్ ది కూడా ఇలాంటికధే, ఇదికూడా నిన్నే రీలిస్టయింది. ఐదేళ్ళక్రితం డీలిస్ట్ అయినప్పుడు దీని ధర 80 పైసలు. నిన్న రీలిస్ట్ అయినప్పుడు ఒక టైం లో 800 టచ్ అయి చివరికి 200 దగ్గర స్థిరపడింది.

మరికొంత న్యూస్ (ఎన్.డి.టి.వి ద్వారా): కె.జి.ఎన్ ఇండస్ట్రీస్, సిఫ్ టెక్నాలజీస్

నాదగ్గరకూడా ఒకపెన్నీస్టాకు (కలర్ చిప్స్) వుంది ప్రస్తుతం డీలిస్ట్ అయింది. గత ఏడాది నుండి ఇది ట్రేడవట్లేదు. భవిష్యత్తులో ఒకవేళ రీలిస్ట్ అయితే నేనుకూడా ఈలెక్కన అరకోటీశ్వరుడయ్యే చాన్సుందేమో అనుకోవడం అత్యాశ అంటారా?

పూర్తి టపా చదవండి!

ఇదేం లాజిక్కు కోట్లబాబూ?

22 May, 2008

నిర్దోషివని తేలేంతవరకూ లొంగిపోవా? ఈ డైలాగు చూస్తుంటే నేను చదువుకునే రోజుల్లో చూసిన కొన్ని సినిమాల్లోని (పేర్లు గుర్తులేవు కానీ చిరంజీవి, బాలక్రిష్ణ గట్రా నటించినవి) హీరో చెప్పే డైలాగులు గుర్తుకొస్తున్నాయి. ఆ సినిమాల్లోనూ అంతే హీరో శానా మంచోడు, పక్కన హీరో ఫ్రెండు నిజాయితీ కల్గిన ఓ పోలీసు. హీరో అనుకోకుండా ఓ హత్యకేసులో ఇరుక్కుంటాడు. పోలీసు ఫ్రెండు అరెస్టు చేయబోతే హీరోగారు తనని అనవసంగా హత్యకేసులో ఇరికించారని డైలాగు మీద డైలాగు కొట్టి తనని తాను నిర్దోషినని నిరూపించుకున్నాకే మళ్ళీ కనిపిస్తానంటాడు (లొంగిపోతాననడు). మరో సినిమాలో సేమ్ సిచ్యుయేషన్ లో హీరోగారు విలన్ లందరినీ ఏరిపారేసి తన కక్ష తీర్చుకొని అప్పుడు లొంగిపోతానంటాడు. అలాగే మన కోట్ల చక్రపాణిగారు కూడా తనని తాను హీరో ననుకున్నారో లేక హీరో చెలికాడిననుకున్నారో గానీ ఆయననోటినుండీ సేమ్ డైలాగు. పాతసినిమాలో చూసిన సీన్లన్నీ భూచక్రం తిరిగినట్టు ఒక్కసారి కళ్ళముందు గిరగిరా తిరిగాయి. నిర్దోషివని తేలేంతవరకూ లొంగిపోవా? నిర్దోషివని తేలింతరువాత ఇక లొంగిపోవడమెందుకు కోట్లబాబూ, ఇదేం లాజిక్కు, దాని మర్మమేమి? ఓహ్హో!! ఈలోపు చక్కపెట్టవలసిన "రాజ"కార్యాలేమైనా వున్నాయా? రౌతు మెత్తనైతే గుర్రం మూడుకాళ్ళమీద దౌడుతీయును, వడ్డించేవాడు మనవాడైతే... (ఇలా చాలావున్నాయి సమయానికి గుర్తురావట్లేదు. చ!) వగైరా వగైరా వగైరా...

పూర్తి టపా చదవండి!

"ఈనాడు" మాటల్లో నా ఆలోచనలు...

కొన్నిరోజుల క్రితం నేను ’మన మధ్యతరగతి ప్రజలు తెగతింటున్నారు’ అని జార్జిబుష్ గారు చేసిన వ్యాఖ్య మీద బ్లాగాను. ఒకప్పుడు ఆహార ఎగుమతి దారయిన మనదేశం/మనరాష్ట్రం త్వరలోనే దిగుమతిదారవచ్చని చెప్పాను. అసలు ఆహార కొరతకి మనరాష్ట్రం, మన నాయకమణ్యులు ఎంత కారణమో నాకుతెలిసిన కొన్ని వివరాలను వెల్లడించాను. ఒక శాస్త్రీయమైన సర్వే లేకుండా సర్కారు ప్రతిసారీ "ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది" అని అంటుందే కానీ అంతకంటే అధికంగా పెరిగిన జనాభాని లెక్కలోకి తీసుకోదు. అదే విషయంమీద ఈరోజు ఈనాడులో "అన్నపూర్ణవాకిట ఆహారసంక్షోభం" శీర్షికతో వచ్చిన వార్త నాఆలోచనలకి దగ్గరగా ఉండడం యాధృచ్చికం. ఈ విషయం మీద ఈనాడు ధారావాహికంగా కధనాన్ని ప్రసారం చేస్తుందట. నేను మిస్సయిన మరికొన్ని కోణాల్ని కూడా ఈనాడు స్పృశించవచ్చు.
కార్టూన్: రవి - ఈనాడు ద్వారా

పూర్తి టపా చదవండి!

డైనమైట్స్ ఆఫ్ ఐ.టి?

21 May, 2008

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వివరాలతో ఒక అనధికారక వెబ్‍సైట్ ప్రారంభమయిందట. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తుంటే ఈ న్యూస్ కనబడింది. ఈవెబ్ సైట్ ని అబిమానులైన సాఫ్ట్‍వేర్ నిపుణులు రూపొందించారట. చిరంజీవి పార్టీపెట్టాక ఈ అనధికార వెబ్‍సైట్ ని "చిరంజీవి యువత" అధికారక వెబ్‍సైట్ గా మారుస్తారట. ఇందులో ఎంతవరకూ నిజమున్నా ఈ సైట్ గురించి నాకున్న కొన్ని అభిప్రాయాలు ఇక్కడ... మీతో...

లుక్ & ఫీల్: అంత రిచ్ గా లేదు బహుశా భవిష్యత్తులే ఏమైనా మారుతుందేమో? (సాఫ్ట్‍వేర్ ఇంజనీరులు తయారుచేసారంటే గొప్పగా ఊహించుకున్నా)
ఎరుపు బ్యాక్‍గ్రౌండ్: కమ్యూనిస్టులతో పొత్తుకు రెడీ అన్నట్లుంది. వాళ్ళని ఇప్పట్నించే ప్రసన్నం చేసుకోవడానికా?
హిట్ కౌంట్: నేను పేపర్ చదివి ఈ పోస్ట్ మొదలుపెట్టినప్పుడు: 10113, పదే నిముషాల్లో 15500,అంతా ఈనాడు పుణ్యమే అనుకుంటా!
లాగిన్: పనిచెయ్యడంలేదు, రిజిస్టర్ చేసుకున్నాక ఈమెయిల్ కన్ఫర్మేషన్ లేదు, లాగిన్ అయినా "వెల్‍కం గెస్ట్" అనేచూపుతోంది.
భాష: క్షమించాలి తెలుగుకి ఇక్కడ చోటులేదు
కంటెంట్: ఇంకా బాలావస్థలోనే ఉంది, ప్రస్తుతానికి పెద్దగా విషయం లేదు. చిరంజీవి పేరే తప్ప ఫోటోలేని సైట్.
మీటింగ్స్ సెక్షన్: "Venue: Satya Sai Nigamam, Srinagar Colony" దీనికి హైదరాబాద్ అని ఒక పదం తగిలిస్తే బాగుంటుంది. దానితో పాటు ఒక మ్యాప్ లేదా ఆ స్థలానికి చేరుకోవడానికి సూచనలు వుంటే బాగుంటుంది.
వెల్‍విషర్స్: ఈ సైట్ ఓనర్స్ యొక్క వెల్ విషర్స్ నూతన్ కుమార్ మరియు శ్రీనివాసగౌడ్ అట. వారి గురించి మకొంత సమాచారం ఇస్తే బాగుంటుంది. నాకైతే వారెవరో తెలీదు. (ఈనాడు ప్రకారం ఈ సైట్ చిరంజీవి అధికారిక సైట్ అయితే ఈ సెక్షన్ ని మార్చాలి ఎందుకంటే చిరంజీవికైతే దాదాపు యావత్ ఆంధ్రదేశం, యావత్ తెలుగుజాతి వెల్‍విషర్సే [కాపీ రైటెడ్ :) ] అలాగని పెట్టుంటే బాగుండేది.)
లోగో & పంచ్ లైన్: ఈ సైట్ కేవలం ఐ.టి వారికోసమే అన్నట్లున్నాయి. చంద్రబాబు వీటిని నమ్ముకునే బొక్కబోర్లా పడ్డాడు గదా!
సరదాగా: ఈ వెబ్‍సైట్ ని మైక్రోసాఫ్ట్ వారి డాట్‍నెట్ అనే లాంగ్వేజ్ లో రాసినట్టున్నారు, అందుకే ఈ వెబ్‍సైట్ పేరుకూడా do(i)t net అనేలా ఉంది.
Update @22-మే-2008: వెబ్‍సైట్ లాగిన్ పనిచేస్తుంది. వెబ్‍సైట్ హిట్‍కౌంట్ 44275 అంటే ఒక్కరోజులో 30000 హిట్లు చిరంజీవి లెవల్ కి ఇంకా ఎక్కువొస్తాయనుకున్నా. బహుశా ఈ నెలాఖరుకి ఒకలక్ష అవుతుందేమో.

పూర్తి టపా చదవండి!

భార్యాబాధితులు...

20 May, 2008

మీరు నోర్బిట్ (ఆంగ్లభాష) సినిమా చూశారా? అందులో హీరో తన గయ్యాళిగంప లాంటి భార్య వలన పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అది సినిమా కాబట్టి చివరిలోనైనా ఆ గయ్యాళినుండి విముక్తి పొందుతాడు. నిజజీవితంలో అదెంతకష్టమో మీకూ తెలుసు. ఈరోజు ఈనాడు పేపర్ లో "పురుషపుంగవులకూ గృహహింస" అనే కధనంలో ఈ గయ్యాళి భార్యల విషయాన్ని సృశించారు. ఇదే పేపర్ లో కొన్నేళ్ళక్రితం కూడా ఇదే విషయంమీద వ్రాసినట్టుగుర్తు. కానీ అప్పుడు ఆ న్యూస్ చూసి నవ్వుకున్నాం తప్పితే అంత సీరియస్ గా ఆలోచించలేదు. అప్పట్లో భార్యాబాధితుల శాతం ఇప్పుడు చెప్పినంతలేదు. ఈనాడు చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రతి ముగ్గురు మగాళ్ళలో ఒకళ్ళు ఏదోరకంగా గృహహింసకి లోనవుతున్నారు. అయితే ఈ సర్వే ఆడా మగా సమానమే అని ఎక్కువగా భావించబడే అమెరికాలో జరిగింది. అక్కడి మగవాళ్ళు చాలా ధైర్యవంతులు మరియు సహృదయులు కాబట్టే ధైర్యంగా బయటపడ్డారు, అలాగే మిగిలినవాళ్ళుకూడా అర్ధంచేసుకున్నారు. మరి మనదేశంలో పరిస్తితి? మనదేశంలో "నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాణ్ణి నమ్మకూడద"ని ఒక సామెత. ప్రస్తుతం ఆడాళ్ళు బాగానే నవ్వుతున్నారు కానీ మగాళ్ళే మనసారా ఏడ్వలేకపోతున్నారు. భార్య హింసపెడుతుందని బయట చెబితే నలుగురూ నవ్వుతారేమోనన్న భయం. సాటి మగాళ్ళలో చులకనవుతామేమోనన్న బాధ. ఆడదానికి ఆడదే శతృవంటాంగానీ మరి ఈ విషయంలో మగాడికి మగాడే శతృవు. మన పాతసినిమాల్లో సూర్యకాంతం నటనని చూసి ఆవిధంగా మగాళ్ళనికొట్టేవాళ్ళుంటారా అంతా ట్రాష్ అనుకునే ఆడాళ్ళుండొచ్చు, ఆ!! ఆడాళ్ళేంకొట్టగలరు మగాళ్ళని అని సర్దుకునే మగాళ్ళుందొచ్చు గానీ కొన్నిసంఘటనలనిచూస్తే ఎంతమగాడికైనా గడ గడ మని కారాల్సిందే. ఆమధ్య చైనాలో ఒక రాకాసి భార్య అకృత్యానికి చావుతప్పి కన్నులొట్టపోయినట్టయింది ఒక భర్తకి.

గత ఐదేళ్ళనుండి మనదేశంలో కూడా భార్యాబాధితుల సంఖ్య పెరుగుతున్నట్లున్నది. వీరిని భార్యాబాధితులనేకన్నా ఆడ-పక్షపాత-చట్టాల బాధితులనడం సబబేమో? వారికి చేయూతగా కొన్ని సంస్థలు మొదలయినాయి ఉదాహరణకి మెన్-సెల్ అలాగే కుటుంబసంక్షేమంకోసం పనిచేసే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ. ఒకప్పుడు ఆడాళ్ళ సమస్యలను అర్ధంచేసుకుని వారిపోరాటంలో మగాళ్ళుసాయపడినట్టుగా ఈ భార్యాబాధిత లేదా ఆడవిధేయచట్టబాధిత సంఘాలకుకూడా కొందరు సహృదయులైన ఆడవారి సాయం లభించడం సంతోషకరమైన వార్త. దానికి ఆధారమే ఈ సంవత్సరం జనవరి నెలలో బెంగళూరులో మరియు ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరిగిన భార్యాబాధితుల మహాధర్నా. అందులో భార్యల ప్రతాపానికీ మరియు ఎవరిది తప్పో తెలుసుకోకుండా ఆడాళ్ళనిమాత్రమే వెనకేసుకొచ్చే కొన్ని దగుల్బాజీ సంఘాలకి వ్యతిరేకంగా బాధితులు, చాలామంది ఔత్సాహికులు పాల్గున్నారు. మరియొక ముఖ్యవిశేషం ఈ ధర్నాలో స్వచ్చందంగా కొందరు ఆడాళ్ళుకూడా పాల్గోవడం. ఇప్పటికీ మగాళ్ళపట్ల, వారికున్న కెపాసిటి పట్ల సమాజానికున్న కొన్ని అపోహల వలన లేదా అనవసరంగా వాళ్ళకివాళ్ళే కల్పించుకున్న "మగాడు, వాడికేంటి" లాంటి ఇమేజ్ వలన చాలామంది బాధితులు బయటికి రావడంలేదు. సమసమాజం కోసం పాటుపడుతున్నామనే వాళ్ళు దీనికేసీ ఒకసారి చూడాలని, చట్టాలు ఆడాళ్ళ చుట్టాలుకాకుండా చూడాలనీ ఈ బాధితుల అభ్యర్ధన.

కార్టూన్ ఇమేజ్ సోర్స్: ఈనాడు

పూర్తి టపా చదవండి!

ఉచిత ఫొటోషాప్ పి.డి.ఎఫ్

19 May, 2008

మీరు వెబ్ డిజైనర్ అయినా లేదా ఫొటోషాప్ ప్రేమికులైనా ఈ ఆఫర్ మీకోసమే. సైట్‍పాయింట్ వారు తమ "The Photoshop Anthology" అనే పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు. దీనిలో వెబ్ సైట్ డిజైన్ కి సంబంధించిన వివరాలు మరియు ఇమేజ్ ఎడిటింగ్ కి సంబంధించిన వివరాలున్నాయి. కావల్సినవారు ఈ క్రింది వెబ్అడ్రస్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరో 24 రోజుల్లో ఈ ఆఫర్ నశిస్తుంది.

హై-రిజల్యూషన్ PDF - photoShop.zip (60+Mb)
కాంపాక్ట్ వెర్షన్ - photoShop.zip (20+Mb)

పూర్తి టపా చదవండి!

మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆర్ట్ తో తెలుగు శీర్షిక/లోగో ఇమేజ్

17 May, 2008

శీర్షికలు/లోగోలు అంటే తెలుసుగా, డాక్యుమెంట్ లకు లేదా మన వెబ్ పేజికి పైన లేదా మనం రాసే ఆర్టికిల్ కి శీర్షికవ్రాసేటప్పుడు వీటిని వాడుతాం. అయితే సాధారణ టెక్స్ట్ ఫార్మేట్ లో గాకుండా వీటిని ఇమేజ్ ఫార్మేట్ లో ఉంచడం వలన కొంత అందంగా కనబడుతాయి. ఉదాహరణకి పక్కనున్న బొమ్మని చూడండి. వర్డ్ డాక్యుమెంట్ లు తయారుచేసి ప్రింట్ చేసినప్పుడు లేదా పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లు వ్రాసినప్పుడు హెడింగ్ కోసం వీటిని వాడితే అవి అందంగా కనబడతాయి. ఆంగ్లంలో లోగో తయారు చేసుకోవడానికి చాలా సాప్ట్ వేర్ లున్నాయి. మీరు గూగుల్ లో కెళ్ళి "ఫ్రీ లోగో మేకర్" అని టైపు చేస్తే చాలా సైట్ లను చూపిస్తుంది. అయితే ఆ సైట్ లన్నీ తెలుగు లో లోగో తయారుచేయడానికి పనికిరావు. అయితే గియితే కమర్షియల్ సాఫ్ట్ వేర్ ని వాడాలి లేడా ఏ డి.టి.పి వాడినో పట్టుకోవాలి. ఒకవేళ ఏ ఫ్రీ ఇమేజ్ ఎడిటర్ ని ఉపయోగిద్దామనుకున్నా దానిని వాడడంలో మనకు కొంత అనుభవం వుండాలి. ఇవేమీ లేకుండా కేవలం మైక్రోసాఫ్ట్ వారి వర్డ్ నుపయోగించి సింపుల్ గా వీటినెలా చేయొచ్చో చూద్దాం. మీరు పైన చూసిన బొమ్మని ఈ విధానం ద్వారానే తయారు చేసాను.
దీనికి కావలసిన ఉపకరణాలు:
1. ఎమ్.ఎస్ వారి వర్డ్ ప్రాసెసర్
2. ఇమేజ్ టూల్ (ఎమ్.ఎస్ పెయింట్ లేదా పెయింట్ డాట్ నెట్ లేదా ఏదైనా మీ చాయిస్)
3. తెలుగు ఫాంట్ లు
4. తెలుగులో వ్రాయడానికి లేఖిని లేదా బరాహా-ఐ.ఎమ్.ఇ లేదా ఏదైనా మీ చాయిస్
మొదటగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ని తెరచి డ్రాయింగ్ టూల్ యాక్టివ్ గా ఉందోలేదో చూడండి. ఒకవేళ లేకపోతే వ్యూ--> టూల్ బార్స్ --> డ్రాయింగ్ మీద నొక్కండి. ఇప్పుడు మీకు క్రింద చూపిన టూల్ బార్ ని వర్డ్ లో చూపించాలి


ఇప్పుడు పై బొమ్మలో ఎరుపు రంగులో వృత్తంలో చుట్టబడ్డ అక్షరం మీద నొక్కండి. అప్పుడు క్రిందచూపిన డబ్బా ప్రత్యక్షం అవుతుంది. అందులో నుండి మీకునచ్చిన ఫార్మేట్ ని సెలక్ట్ చేసుకోండి.


ఒ.కె బటన్ ని నొక్కింతరువాత మీకు క్రింద చూపిన డబ్బా వస్తుంది.

దీనిలో మీకు కావల్సిన తెలుగు ఫాంట్ ని సెలక్ట్ చేసి మీరు కావాలనుకున్న తెలుగు అక్షరాలని టైప్ చేయండి. దీనికోసం లేఖిని లేదా బరాహ లాంటి టూల్ ని వాడవచ్చు. లేదా కావాలనుకున్న తెలుగు మాటని మీ క్లిప్ బోర్డ్ లో ఉంచి ఇక్కడ పేస్ట్ చెయ్యవచ్చు. తరువాత ఒ.కె అన్న బటన్ మీద నొక్కండి. ఇప్పుడు వర్డ్ ఆటోమేటిక్ గా ఆ తెలుగు అక్షరాల్ని వర్డ్ క్రిందచూపిన విధంగా ఉంచుతుంది.


ఇప్పుడు తెలుగు బొమ్మని సెలక్ట్ చేసినప్పుడు, వర్డ్ తన వర్డ్ ఆర్ట్ టూల్ బార్ ని చూపెడుతుంది. దానిలో పైన చూపినట్టుగా ఎరుపు వృత్తంలో చుట్టిన పనిముట్టు "ఫార్మేట్ వర్డ్ ఆర్ట్" మీద నొక్కండి (బొమ్మని సెలక్ట్ చేసినప్పుడే ఈ టూల్ బార్ కనబడుతుంది) అప్పుడు క్రింద చూపిన బాక్స్ కనిపిస్తుంది.


అందులో పై బొమ్మలోచూపిన విధంగా "ఫిల్ ఎఫక్ట్స్" అనే దానిమీద నొక్కండి. అప్పుడు క్రింద చూపిన బాక్స్ కనిపిస్తుంది.


అందులో "పిక్చర్" అనే టాబ్ మీద నొక్కి మీకు నచ్చిన ఇమేజ్ ని సెలక్ట్ చేయండి. ఈ ఇమేజ్ ని బ్యాక్ గ్రౌండ్ గా ఉంచి వర్డ్ ఆర్ట్ మన తెలుగు టెక్స్ట్ ని మార్చుతుంది. ఒక్కసారి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ని ఎంచుకుని ఒ.కె బటన్ ని నొక్కిన తరువాత వచ్చిన బొమ్మ పైన చూపిన విధంగా ఉంటుంది. వర్డ్ నుండి దానిని కాపీ చేసి (మీ మౌస్ ని రైట్ క్లిక్ చేసి కాపీ అని నొక్కండి) ఏదైనా ఇమేజ్ ఎడిటర్ లో పేస్ట్ చేసి, దానిని బి.ఎమ్.పి/జెపిజి/జిఫ్ లేదా పిఎన్.జి ఫార్మేట్ లో సేవ్ చేసుకోవచ్చు.
మీకు కొద్దిగా (చాలా కొద్దిగా అయినాసరే) ఇమేజ్ ఎడిటింగ్ అనుభవం ఉంటే, మరికొంత సుందరంగా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ప్రక్కన చూపిన విధంగా... అలాగే ఇమేజ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే కూడా ఇమేజ్ టూల్ తో కొంత అనుభవం వుండాలి.

పూర్తి టపా చదవండి!

వచ్చే సారి కూడా దేవుడిపాలనే - వై.ఎస్.ఆర్

15 May, 2008

"మళ్ళీ అధికారం నాదే": నిన్న జరిగిన కాంగ్రేస్ పునరంకిత సభలో మఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ అన్నమాటలివి. డైరెక్ట్ గా "నాదే" అనకపోయినా దాని అర్దం అదే కదా ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రేస్ అంటే మీరు, మీరంటే కాంగ్రేసే కదా. అయినా రాకూడదనడానికి మాకేం హక్కుంది? వై.ఎస్.ఆర్ గారు మీరన్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో కనీవినీ ఎరుగనంత అభివృద్ధి జరుగుతుంది.
ఆయన గురించి ఆయనే ఒకానొక సందర్భంలో చెప్పుకున్నట్లు ఇది దేవుడి పాలన, దేవుడు ఆశీర్వదించిన పాలన, సాక్షాత్తూ ఆ దేవదేవుడే ఈ రక్షకుడి రూపంలో వచ్చి మనజన్మని చరితార్ధం చేసాడు. తెలియని వెర్రి జనాలు ఏదో అంటుంటారు మీలాంటివారు (వై.ఎస్.ఆర్) వీటిని పట్టించుకోకూడదు. నిజమే సార్ సామాన్యులు ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమందైతే తట్టుకోలేక గుండాగి, పోతున్నారుకూడా. దానికి మీరేం చేయగలరు చెప్పండి, దేవుడి పాలన చూసే అదృష్టం వాళ్ళకిలేదు. ఈరాష్ట్రానికి మీరెన్ని చేసారో ఓసారి ఈ జనాలకి గుర్తుచేద్దాం రండి. మీరు వాగ్ధానం చేసినట్టుగానే రైతులకు ఉచిత కరంటు ఇచ్చారు (గిట్టనివారు విద్యుత్ తీగలమీద బట్టలారేసుకుంటే మీరేంచేయగలరు), వేలకోట్ల రైతురుణాలు మాఫీచేసారు (అయినా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరేం చేయగలరు, అయినా దాని కోసం మీరడిగింది కేవలం వారి భూమినేకదా, ఇచ్చేస్తే పోయేదానికి ఆత్మహత్యలవసరమా?), లక్షలకోట్ల రూపాయలతో జనయఙ్ఞం చేశారు (గిట్టనివాళ్ళు ధనయఙ్ఞం అని ఆడిపోసుకుంటుంటే మీరేం చేయగలరు?). మీ నిజాయితీ గల ప్రభుత్వానికి వామపక్షాలే మీ చెంతచేరాయి, పొగిడయి ( నాలుగేళ్ళు కాపురం తర్వాత వాళ్ళే రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని మీచేతికే చెయ్యిస్తే మీరేంచేయగలరు తిట్టడంతప్ప?). ఉచితపధకాలకి మరియు ప్రజా (పార్టీ) సేవకు డబ్బుకోసం సెజ్ పేరుతో భూములమ్మితే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఈ జనాల లొల్లేంటో? "ఉచితం" అనగానో పొలో మని ఓట్లేసే ఓళ్ళు ఇలాచెయ్యకపోతే ఈ ఉచిత పధకాలకు డబ్బులెక్కడనుండి వస్తాయో ఆలోచించక్కరలేదా? మీ ప్రభుత్వ అవినీతి మీరు చెప్పినట్లు గత ప్రభుత్వంకన్నా ఎంతో తక్కువని, ఈ రాష్ట్రం లో జరిగే నేరాలు బీహార్ కన్నా ఎంతోనయమని ఎందరికి తెలుసు? ఎన్నో ప్రజా ప్రయోజనాల విషయాలలో ప్రజలే మిమ్మల్ని అర్ధం చేసుకోకపోతే మీరెంత బాధపడ్డారో వాళ్ళకేం తెలుసు? మీగొప్పతనాన్ని మాత్రమే ప్రజలచెంతకు చేర్చకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని ఒక పత్రికాధిపతిని శిక్షిద్దామని శక్తివంచలేకుండా కృషిచేస్తుంటే రచ్చచేస్తున్నవాళ్ళనేమనాలి? ఇకలాభంలేదని మీ గొప్పతనాన్ని మీరే చాటుకోవడానికి కష్టపడి "సేకరించిన" డబ్బుతో పత్రిక పెట్టుకుంటే దానిని విషపుత్రిక అని కాంగ్రేస్ కరపత్రమని అంటారా ఎంతధైర్యం. ప్రజల కష్టాల్ని చూడలేక ఎంతో నీతితో నిజాయితీతో రోజుకి లక్షలకొద్దీ నష్టాలనుకూడా లెక్కచేయకుండా ప్రజాప్రయోజనాలకోసం పేపరుని రెండురూపాయలకే ఇస్తుంటే దానిని పట్టుకుని నల్లడబ్బుతో నడిపే పేపరని అంటారా(నల్లడబ్బైతే మాత్రం కష్టపడకుండా వచ్చిందా)? పేదలకోసం (వాళ్ళ ఓట్లకోసం) కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందిస్తుంటే దానిని తమ సొంతపధకమని అప్పోజిషనోళ్ళు ప్రచారం చేసుకుంటారా? నాలుగేళ్ళక్రితం అడుక్కుతిన్న వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వరులైంది ఈ పాలనలోనేగదా, ఫోర్డ్ వాళ్ళు సరిగ్గా సర్వే చెయ్యలేదుగానీ , చేసుంటే ప్రపంచం లో టాప్ 10 కోటీశ్వరులు మనరాష్ట్రం నుండే వుండేవాళ్ళు, అదీ మీ పుణ్యమేగా? ప్రజల్లో ఒకడిగా మీ ఇడుపులపాయ ఎస్టేట్ ని అభివృద్ది చేసుకుంటే దానినీ తప్పుపడతారా దానివలన ఎంతమంది కూలీలు ఉపాధిపొందుతారో వాళ్ళకు తెలియదా? పైగా సొంతలాభంకోసం జీ.వో.లు తెచ్చుకున్నారని అభాండాలు వేస్తారా? అంతే సార్ మంచికి రోజులు కావు. మీరన్నుకున్నట్లు గానే దేవుడి పాలనని ప్రజలు మర్చిపోకుండా తగిన బహుమతిని వచ్చే ఎన్నికలలో ఇస్తారని ఆశిద్దాం.

[కార్టూన్ బొమ్మ: ఈనాడు పేపర్ నుండి తీసుకోబడినది, హక్కులేమైనా ఉంటే ఈనాడు మరియు శ్రీధర్ గారివే]


పూర్తి టపా చదవండి!

కంచికి చేరిన చెంపదెబ్బ కధ - భజ్జీకి స్వల్ప శిక్షతో సరి

14 May, 2008

అనుకున్నట్టుగానే ఐ.పి..ఎల్ యాక్షన్ హీరో హర్భజన్ సింగ్ 5 వన్డే మ్యాచ్ ల స్వల్ప నిషేధంతో బయటపడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఒక 20-20 మ్యాచ్ చివరలో అన్న లాంటి భజ్జీ తన తమ్ముడి లాంటి శ్రీశాంత్ ప్రవర్తన బాగోక సరదాగా చెంపదెబ్బ కొట్టాడంట. మొదట తమ్ముడు ఈ విషయంలో బాధపడినప్పటికీ తరువాత కొట్టింది అన్నలాంటి భజ్జీ నేగదా అని సర్దుకుపోయాడంట. వాడు సర్దుకుపోయినా అంతర్జాతీయంగా డేగకళ్ళతో ఈ విషయాన్ని చూస్తున్న వారిని బుజ్జగించడానికి బి.సి.సి.ఐ పెద్దలు ఏదోఒకటి చేయాలిగా. అందుకని ఒక కమీషన్ లాంటిది ఏర్పాటు చేసారు. ఈ విషయంలో నానావతి కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బి.సి.సి.ఐ ఈ నిషేధాన్ని విధించిందట. ఇప్పటికే ఐ.పి,.ఎల్ లో 11 మ్యాచ్ ల నిషేధం ఉంది (డబ్బుల్లో కోతేంలేదండి, ఐ.పి.ఎల్ లో పేరున్నందుకు మామూలుగానే ఫీజు ముడుతుంది). అసలైతే నిబంధనల ప్రకారం జీవితకాల నిషేధానికి గురికావలసిన వాడు అదృశ్య శక్తులపుణ్యమా అని అతి తక్కువశిక్షతో సరిపెట్టుకున్నాడు. ఆ శిక్షకూడా పడకపోవును కానీ ఆ మాత్రం లేకపోతే అంతర్జాతీయంగా పరువుపోతుందేమోనని భయపడి ఇచ్చినట్టున్నారు. ఈ మొత్తం ప్రహసనంలో వెర్రివెంగళాయలు ఎవరైనా వున్నారంటే వాళ్ళు ప్రేక్షకమహాశయులే. వారికి ప్రతీదానికీ ప్రతీదానికీ ఓవర్ గా రియాక్ట్ కావడం ఒక అలవాటు. అప్పుడెప్పుడో శిల్పాశెట్టి వ్యవహారం తరువాత ఆస్ట్రేలియా లో భజ్జీ vs సైమండ్స్ విషయం తరువాత ఇప్పుడు భజ్జీ vs శ్రీశాంత్ వ్యవహారం. శిల్పాశెట్టి, సైమండ్స్ వ్యవహారాలు మరీ దారుణం, వాటిని ఒక జాతికి వచ్చిన సమస్యలుగా మార్చేశారు. ఇప్పుడు భజ్జీ విశ్వరూపం చూసిన వాళ్ళకి అప్పుడు సైమండ్స్ చెప్పిన మాటల్లో యధార్ధముందేమోనన్న చిన్న సందేహం రాకమానదు.

పూర్తి టపా చదవండి!

చంద్రబాబు అన్న మాటలో అర్ధమేమిటి?

"అవినీతి పై ఎన్నికలు జరిగితే కాంగ్రేస్ దే విజయం: బాబు" అనే శీర్షికతో ఈ రోజు ఈనాడు పేపర్లో 15వ పేజీలో వచ్చిన వార్త చూశారా? దీని అర్థం ఏమిటో మీకు అవగతమైందా? చెప్పేవాడికి సరిగా చెప్పడం రాలేదో లేక రాసేవాడికి సరిగా అర్ధంకాలేదో లేక నేనే సరిగా అర్దం చేసుకోలేకపోయానో గానీ ఈ వ్యాఖ్య నాకు మటుకూ వంకర అర్దాన్ని కలుగజేసింది. ఒకవేళ బాబుగారి ఉద్దేశం అవినీతిపై ఎన్నికలు (రిఫరండం) పెడితే కాంగ్రేస్ కే ఎక్కువ మార్కులు (ఓట్లు) పడతాయనా? అలా అయితే దాన్ని కాంగ్రేస్ విజయమంటారా లేక ఓటమంటారా? విజయం అంటే గర్వంతో తలెత్తుకు తిరిగేలా చేసేది, కాంగ్రేస్ కి అవినీతిలో ఎక్కువ మార్కులొస్తే అది విజయగర్వం ఎలా అవుతుంది? ఈ విషయం లో రెండు రకాల ప్రశ్నలు అడగవచ్చు

౧) "కాంగ్రేస్ అవినీతి ప్రభుత్వమా? - అవును / కాదు"
౨) "అత్యధిక అవినీతి ప్రభుత్వం - టి.డి.పి/కాంగ్రేస్"

కాంగ్రేస్ గెలుపు, "కాదు" అన్నదానికి ఎక్కువ వోట్లు వస్తే కదా. అంటే దానర్దం అవినీతి ప్రభుత్వం కాదనేగా. బహుశా బాబు ఉద్దేశం రెండవ ప్రశ్నేమో? ఇందులోకూడా ఎక్కడో తంతున్నట్టుంది. మీరేమంటారు?

పూర్తి టపా చదవండి!

మాతృమూర్తులకు అభివందనం

12 May, 2008

నిన్న అంటే ది 11-మే-2008 ఆదివారం నాడు మదర్స్ డే . అంటే మనం ఈరోజుని చూడడానికి కారకులలో ముఖ్యమైన వ్యక్తి మన మాతృమూర్తి ని ఒక్కసారి తలచుకొని వారికి మన హృదయపూర్వక వందనాలు తెలుపుకునే రోజు. మనమీ స్థితికి రావడానికి అమ్మ నాన్న ఇద్దరూ కారకులే కాబట్టి వారిద్దరికీ కలిపి నా అభివందనం. ఇప్పుడి రోజులు నా చిన్నప్పటిలా లేవు. ఇప్పటి పిల్లలకు నా చిన్నప్పటిలా తల్లిదగ్గర ఎక్కువసేపుండే అదృష్టం లేదు. అప్పటి రోజుల్లో తల్లికి బిడ్డతోడిదే లోకం, ఇప్పటి తరం పిల్లలు ఈ విషయంలో దురదృష్టవంతులు. దానికీ ఎన్నెన్నో కారణాలు.

అమ్మతనానికి అసలైన నిర్వచనంగా నిలుస్తూ బిడ్డల ఆలనా పాలనలో జీవితాన్ని త్యాగంచేస్తూ మేము ఈ రోజు ని చూడడానికి కారకులైన "అమ్మ"లందరికీ మీబిడ్డల వందనం. బ్లాగ్ మిత్రులకు మాతృదినోత్సవ శుభాకంక్షలు.

పూర్తి టపా చదవండి!

టెక్సాస్ లో కుంగుతున్న భూమి - వీడియో

09 May, 2008

టెక్సాస్ లోని డయాసెట్టా వద్ద భూమి క్రుంగుతూ అక్కడవున్న అన్ని వస్తువులనీ, వాహనాలనీ, టెలీఫోన్ స్తంభాలనీ కూడా మింగేస్తుందంట. దాదాపు 600 గజాల విస్తీర్ణంలో 250 అడుగుల లోతున ఏర్పడిన ఈ గొయ్య రోజు రోజు కి పెరుగుతుందట. కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ డయాసెట్టా భూమిక్రింద వున్న సాల్ట్‍డోమ్ లే దీనికి కారణమని అనుకుంటున్నారు. దానికి సంభందించి కొన్ని ఫొటోలు ఇక్కడ ఫాక్స్ న్యూస్ ద్వారా. NECN అనే వెబ్ సైటులో వున్న వీడియో చిత్రాన్ని కూడా తిలకించండి.

పూర్తి టపా చదవండి!

ఊహూ! నేనీ సీటు వదలను - ’జిడ్డు’ రాందాస్

మన తెలుగు బిడ్డ వేణుగోపాల్ మళ్ళి ఎయిమ్స్ డైరెక్టర్ గా పదవీబాధ్యతలు చేపట్టారట అదీ సుప్రీంకోర్టు ఆశీర్వాదంతో. అదేంటి! మరి ఈ కధలో విలన్ అన్బుమణి రాందాస్ ని పట్టుకుని ’జిడ్డు’ రాందాస్ అంటున్నాడు ఏంటి వీడు అనుకుంటున్నారా? పూర్తిగా చదవండి సార్. ఈరోజు న్యూస్ పేపర్ లో "తెలుగోడి విజయం" పేరుతో ఈనాడు , "తెలుగుతేజం విజయగీతిక" పేరుతో జ్యోతి, "రాందాస్‍కు పరాభవం" పేరుతో సాక్షి రాసిన వార్తలు చాలా అనందం కలిగించాయి. అయితే అంతగొప్ప తెలుగు వ్యక్తికి మన తెలుగువాళ్ళ తరపున లభించిన సహకారం ఎంత? మన తెలుగువాడికి అందునా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక్ వైద్య నిపుణుడికి మన తెలుగు ప్రభుత్వంనుండి, ప్రజలనుండి, పార్టీలనుండి లభించిన సహకారం పత్రికలలో ఒకరోజు స్టేట్‍మెంట్లు తప్ప దాదాపు గుండుసున్నా. ఎందుకంటే కేంద్రంలో ఆ చెత్త నిర్ణయం తీసుకున్న మహానుభావులు మన రాష్ట్రాన్నేలే మహానుభావులు ఒకేపార్టీవాళ్ళు కాబట్టి. మీరు బాధపడినా, తిట్టుకున్నా గానీ ఫరవాలేదు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే తమిళులకున్నపాటి ఆత్మగౌరవం కూడా తెలుగువాళ్ళకి లేదు. ఉండుంటే అప్పుడే కనీసం ఒక ధర్నాయో లేకపోతే మరోరకంగానో నిరసన తెలిపుండే వాళ్ళం ఆయనకి మన సంఘీభావం తెలిపేవాళ్ళం. గత నాలుగేళ్ళ లో మనరాష్ట్రానికి రావల్సిన ఎన్నో కేంద్రప్రభుత్వ సంక్షేమ పధకాలను తమిళనాడు తన్నుకుపోతుంటే ఆ తప్పు గుడ్లప్పగించి చూస్తూనేవున్న మన రాజకీయ నాయకులదా? రాష్ట్ర సంక్షేమం కన్నా పార్టీనే మిన్ననుకునే మన ముఖ్యమంత్రిగారిదా? అన్నీ తెలిసీ మౌనంగా ఉన్న మనలాంటి ప్రజలదా? బహుశా తమిళులకి ఆంధ్రులు ఆరంభశూరులే కాదు చేతగాని వాళ్ళనికూడా అనిపిస్తుందేమో!. గుంటనక్కలా ఎన్నో రకాల ఎత్తులువేసి చివరికి గోపాల్ ని ఘోరంగా అవమానించి ఇంటికిపంపిన రాందాస్ కి ఇప్పుడు అలాంటి అవమానమే మిగిలింది. సిగ్గు ఎగ్గు ఉన్నవాడైతే ఈపాటికి రాజీనామా చేసిఉండేవాడు. అలాచేయలేదు సరికదా పైప తనతప్పేం లేదనీ, ఆయనని వెళ్ళగొట్టడం వెనుక UPA ప్రభుత్వం కూడా వుందని బుకాయిస్తున్నాడు. తన సీటుని వదలనంటున్నాడు. మొన్నామధ్య బాలు అని ఒకమంత్రి గారికూడా ఇలాగే స్వయం సేవయే పరమార్ధమని తలంచి చేసుకున్న పనులు మన్మోహన్ గారికి తలనెప్పి తెచ్చిపెట్టాయి. పాత్రలకంటిన జిడ్డుని వదలగొట్టడం తేలికే గానీ ఈ జిడ్డుని వదిలించుకోవడం ఎలా అని మన్మోహన్ గారు ఇప్పుడు ఆలోచిస్తుండుంటారు.

పూర్తి టపా చదవండి!

దొరకనంతవరకూ అందరూ దొరలే...

07 May, 2008

అన్నట్లుంది మన తెలుగు సినిమాల్లో కొందరి పరిస్థితి. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిశలు అన్నట్లు పైకి మటుకూ నీతులు చెబుతూ తె‍ర వెనుకమాత్రం విలనీ పనులు చేస్తుంటారనుకుంట. తెలుగు సినిమా రంగానికి సంభందించి గత కొన్నేళ్ళుగా జరుతున్న సంఘటనలు పరిశీలిస్తే ఎవడెప్పుడు విలన్‍గా అవతరిస్తాడో చెప్పడం కష్టంగా ఉంది. చెల్లని చెక్కులిచ్చి అవతలివారిని తమచుట్టూ/కోర్టులచుట్టూ తిప్పించే ఘనులు, తమ అవసరాలకోసం మాఫియా తో చెట్టాపట్టా లేసుకుని అవసరం అయితే అవతలివారినీ లేపెయ్యగ నికృష్టులు, వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడులా ఎక్స్‍ట్రా సంపాదన కోసం కాల్ గర్ల్ గా అవతారమెత్తుతున్న నాయకిలు, చిల్లర డబ్బులకోసం వీసాల రూపంలో దేశాల్నే మోసంచేసే నాయకీమణులు, చివరికి ఇదిగో మొన్ననే తనను అందలం ఎక్కించిన జనాల నెత్తినే "గోల్డ్ క్వెస్ట్" కుచ్చుటోపీ పెట్టాలనుకున్న వారికి మనఃపూర్వకంగా సహకరించిన ఒకప్పటి వెండితెర కధా నాయకుడు ఇప్పటి క్యారెక్టర్ (ఉందంటారా, లేదంటారా?) నటుడు చంద్రమోహన్. ఎవడైనా దొంగ దొంగతనంచేసి దొరికిపోతే ఏమంటాడు? తనకేపాపం తెలియదని, అనవసరంగా ఇరికించారని లేదా శతృవుల కుట్ర అని అంటాడు. ఈయన మటుకూ అలా బుకాయించే రకం కాదండీ, చాలా నిజాయితీ పరుడు అందుకే తనకన్నా పెద్ద దొంగలు సినిమా రంగంలో చాలా మంది ఉన్నారని తాను చేసింది చాలా తక్కువని అన్నారు. పైగా దమ్ముంటే వాళ్ళను పట్టుకోడని సవాలు చేశారట (తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్పవచ్చుగా? దేశం బాగుపడేది) . ఇది చూస్తుంటే మన శాసన సభలో అధికార పక్షం ప్రతి పక్షం మీద చెప్పే మాటల్లా లేవూ? మన Y.S.R కూడా ఇలాగే ఫలానా దాంట్లో అవినీతని ఎవరైనా అంటే చాలు, మీ జమానా లో ఇంతకన్నా ఎక్కువే జరిగిందని ఎదురు దాడి చేస్తారు. బహుశా చంద్రమోహన్ కూడా రాజకీయాల్లో చేరదామనుకుంటున్నాడేమో? షరా మామూలు గానే "మా" (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వాళ్ళు వచ్చి "మా " టి.వీ.ముఖంగా ఆయన చెప్పిందాన్ని ఖండించారనుకోండి. అంతే ఎవడైనా దొరికేంత వరకే దొరలు, లేకపోతే ముందే ఒప్పుకుంటారేటీ మీ పిచ్చి గానీ!. పోలీసులు కూడా వాళ్ళ రొటీన్ డైలాగు "నేరస్తులెంతపెద్దవాళ్ళైనా వదిలేది లేదు" ని అప్పగించేశారు. మొన్నటి దొంగ వీసాల కేసులో ఎందరో ప్రముఖ తెలుగు నటులు ఉన్నారని ఎంబసీ వాళ్ళు అన్నారు, ఆ పేర్లని మన పోలీసులకిచ్చారట. దాని అతీ గతీ ఇప్పటిదాకా లేదు, ఇక ఉండకపోవచ్చు కూడా. ఈ గోల్డ్ క్వేస్ట్ కేసు కూడా అంతేనేమో.

పూర్తి టపా చదవండి!

బ్లాగర్ లోనే మీ బ్లాగు స్టాటిస్టిక్స్ - త్వరలో రాబోతోంది

06 May, 2008

గూగుల్ త్వరలోనే తన బ్లాగ్ అనాలసిస్ టూల్ "గూగుల్ అనలటిక్స్" ని బ్లాగర్ తో కలుపుతుందట. ఇప్పటిదాకా అనలటిక్స్ మరియూ బ్లాగర్ రెండూ కూడా గూగుల్ ఉత్పత్తులే అయినప్పటికీ బ్లాగర్ లో ఉన్న మన బ్లాగు స్టాటిస్టిక్స్ కావాలంటే మాత్రం అనలటిక్స్ లో సభ్యత్వం తీసుకొని ఆ కోడ్ ని మన బ్లాగులో ఉంచాలి. అంతేకాక ఆ స్టాటిస్టిక్స్ చూడాలంటే ప్రత్యేకంగా అనలటిక్స్ సైట్ కి వెళ్ళి చూడాలి. కొన్నాళ్ళ క్రితం గూగుల్ మెజర్ మాప్ అనే సైట్ ని కొన్నాది. దానినుపయోగించే ఈ కొత్త ఫీచర్ ని బ్లాగర్ లో ప్రవేశపెట్టాలని యోచన.

గూగుల్ అనలటిక్స్ అనేది అన్ని రకాల బ్లాగ్ ప్లాట్‍ఫార్మ్ లకు పనిచేస్తున్నప్పటికీ మెజర్‍మేప్ నుండి కొన్న సాఫ్ట్ వేర్ ని మాత్రం బ్లాగర్ కోసమే మార్చుతున్నారు. అంటే అనలటిక్స్ లో లేని చాలా ఫీచర్స్ ని దీనిలో ఉంచాలని వారి ప్రయత్నం. ఈ కొత్త ఫీచర్ అనలటిక్స్ కన్నా సరళంగా ఉంటుందని అనలటిక్స్ అధికారిక బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ బీటా వెర్షన్ లో ఉంది, పబ్లిక్ బీటా కి రావడానికి ఇంకొన్ని నెలలు పట్టవచ్చు.

పూర్తి టపా చదవండి!

’మధ్యతరగతి’ హఠావో? బుష్ చిందుల్లో మర్మం ఏమిటో!

03 May, 2008

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు కారణం మనమే నని మకుటం మాత్రమే తక్కువైన బుష్ చక్రవర్తిగారు సెలవిచ్చారు. మనవాళ్ళంతా తెగ తిని ప్రపంచానికి తిండిగింజలు లేకుండా చేస్తున్నామని ఆయన‍ ఉద్దేశమట. ఈమధ్య మన మధ్యతరగతి ప్రజల కొనిగోలు శక్తి పెరగడమే ఈ ధరల పెరుగుదలకి కారణం అని ఆయన సూత్రీకరణ. ఆయన గారి బాధని కొద్దిసేపు పక్కన బెట్టి అసలు మనదేశంలో ధరలు పెరగడానికి మన ప్రభుత్వాలెంత కారణమో చూద్దాం. ఈ విషయంలో నాకు కొన్ని ప్రభుత్వ విధానాలమీద అనుమానం ఉంది. వాటిని మీ ముందు ఉంచుతాను.


బడాబాబుల చిల్లరకొట్లు: రాండి బాబూ రండి చవక బాబూ చవక అంటూ ఈమధ్య మన దేశంలో కొత్త కొత్త "మాల్స్" (ఎయిర్ కండిషనింగ్ తో, ఆధునిక హంగులతో) పుట్టుకొస్తున్నాయి. జనాలు చిల్లర కొట్లకి వెళ్ళడం బాగా తగ్గించేశారు. రైతు పొలం నుండి పంట నేరుగా మాల్స్ గిడ్డంగులలోకి పోతుంది. ఈ నిల్వలు సాధారణంగా సంవత్సరానికి సరిపడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండవచ్చు కూడా. ప్రభుత్వాని ఈ విషయంలో ఎలాంటి లెక్కలూలేవు. ఇంకేముంది వారు ఆడిందే ఆట చెప్పిందే రేటు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని మాల్స్ అన్నీ రేట్లు తగ్గించకపోతే వారి గొడౌన్ లమీద దాడిచేస్తామని ప్రభుత్వం బెదిరించింది. దాంతో వారు రేట్లు కొంత తగ్గించాలని నిర్ణయించినట్టు పేపర్లలో వార్త వచ్చింది. అంటే ఆ మాల్స్ వాళ్ళు కావాలనే ఎక్కువధరకు అమ్ముతున్నట్టేకదా! ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండిఉంటే నిజంగానే దాడిచేసి వారిని దార్లో పట్టేది.

ఒకడికి మంచి మరొకరికి కీడు: ముఖ్యమంత్రి Y.S.R అధికారంలోకి రాగానే ఒకమాటన్నారు మీకందరికీ గుర్తుండే ఉంటుంది. అదేంటంటే మన రైతులు నెమ్మదిగా వ్యవసాయేతర ఉపాధులవైపు మళ్ళాలని ఎందుకంటే వ్యవసాయం అంతగా గిట్టుబాటు కావడం లేదని ఆయనన్నారు. ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అందరూ వ్యవసాయం మానేసి వ్యాపారాలు చేస్తే పంటపండించేదెవరు? కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలు కావా? మనకి కంప్యూటరెలాగో రైతుకి వ్యవసాయకూలీ అలాంటి వాడు. కూలీ లేకుండా రైతు వ్యవసాయం చెయ్యలేడు. పదేళ్ళ క్రితందాకా రైతుకి కూలీలు విరివిగా దొరికేవాళ్ళు. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పధకం వచ్చి రైతుల పొట్ట కొట్టిందని నా అభిప్రాయం. క్రితం ఏడాది మా పొలం కౌలుదారు మా దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి చెప్పుకుని బాధపడ్డాడు. అంతకుముందు వ్యవసాయ కూలీలు పనులకోసం రైతుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు రైతులు వ్యవసాయ కూలీలకోసం తిరిగే పరిస్థితి వచ్చింది. అలా తిరిగినా అదృష్టం ఉంటే గానీ వాళ్ళు దొరకడం లేదు అలాంటప్పుడు వ్యవసాయేతర కూలీలను తెప్పించుకుంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం మంచిదే దాని ఉద్దేశం పనులు లేనప్పుడు వారికి పని కల్పించడం కానీ ఎందుకనో ఆ పనులు చేసినవారి మళ్ళీ వ్యవసాయ పనులకు రావడం లేదు. ఇది వ్యవసాయానికి పెద్ద దెబ్బే.

సెజ్ చిచ్చు: రైతు తన పొలాన్ని కన్న బిడ్డలా చూసుకుంటాడు, ఆ పొలాన్ని అర్ధంచేసుకుంటాడు. దానికి ఏ సమయంలో ఏంకావాలో అవన్నీ అందిస్తాడు. మందులు చల్లినంతమాత్రాన పొలాలన్నీ బాగా పండితే మనకి తిండిగింజలకి ఏ కొరతా ఉండదు. అంత కష్టపడి సాగులోకితెచ్చి బంగారాన్ని (అన్నం, బంగారమే కదా!) పండించే పచ్చటి పంటపొలాల్ని "సెజ్" ల పేరుతో పారిశ్రామిక వేత్తలకి ధారపోసి రైతుల పొట్ట గొడుతున్నారు. వేలకు వేల ఎకరాల వ్యసాయ భూమి ఆవిరైపోతుంటే అది ఎవరికి నష్టం?

రైతు ఆత్మహత్యలు: ఏ పనికైనా అనుభవం చాలా అవసరం, వ్యవసాయం ఏమీ దీనికి అతీతం కాదు. చిన్నప్పుడు తండ్రితో పాటు పొలానికేళ్ళే దగ్గరినుండి తాను సొంతంగా వ్యవసాయంచేసే వరకూ రైతు నేర్చుకొంటూనే ఉంటాడు. మన ప్రభుత్వాల నిర్వాకాలవల్లనేమీ మరే కారణమైతే నేమీ చాలామాంది అనుభవమున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకుటుంబాలు కూలీలుగా మారుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకొని ఆ లోటు భర్తీచేసే వారేరి? మన కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే వెంటనే వారికి రీప్లేస్‍మెంట్ చూస్తాం అవసరమైతే ఆ కొత్తవాళ్ళకి శిక్షణ నిస్తాం. మరి ఈ రైతులకి రీప్లేస్‍మెంట్ జరుగుతుందా లేదా శిక్షణ ఉందా అని పట్టించుకునేవారేరీ?

మన ఆలోచనాసరళి: ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఆఫీసు భవనం ఒక సెజ్. దీనిలో ౨ వేలమంది పనిచేస్తున్నారు. అంటే ౨ వేలమందికి అన్నంపెడుతుంది అనొచ్చా? ఒక్కనిమిషం ఉండండి... ఈ భవనం భూమి ఉన్న ప్రదేశంలో అంటే దాదాపు ౧౦ ఎకరాలలో ఒకప్పుడు వ్యవసాయం చేసేవారు. అంటే ఆ ఫలసాయాన్ని మన దేశం కోల్పోయినట్టేగా! ఎకరానికి ౩౦ బస్తాల ధాన్యం వేసుకున్నా మొత్తం ౩౦౦ బస్తాల ధాన్యం మన కోల్పోయాం. ఇది దాదాపు ౧౦౦ కుపైగా కుటుంబాలకు సంవత్సరాని సరిపోతుంది. ఈ విధంగా వేల ఎకరాలు పోతే ఇక మన దగ్గర దబ్బున్నా కొనడానికి ధాన్యం ఏది? మరి రేట్లు పెరగక చస్తాయా? ఎవరూ కూడా అభివృద్ధి కి వ్యతిరేకం కాదు పరిశ్రమల ద్వారానే మనం అభివృద్ధి చెందాలనే అభివృద్ధి వాదులు ఆ పని జరిగిన తరువాతైనా ఈ రైతుల గురించి ఆలోచిస్తే ఎంతో మంచిది.

ఇవి నాకుతెలిసిన కొన్ని కారణాలు మాత్రమే కావచ్చు ఇంకా తెలియని కారణాలెన్నో...
ఒక దేశం మీద ఆంక్షలు విధించడానికి ముందో లేదా దాడిచేయడానికి ముందో ఈవిధంగా నోరుచేసుకోవడం అమెరికా వారి ఆచారం. మరి ఈ నోటి దురద వెనకున్న కధేమిటో ముందుముందు తెలియొచ్చు.

చివరగా.... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు మన హైదరాబాదు వచ్చారు. వారికి మన వాళ్ళ దరిద్రం చూపిస్తే బాగోదని హైదరాబాదులోని బిచ్చగాళ్ళందరినీ తరిమేశారని అప్పట్లో పేపరోళ్ళు కోడైకూశారు. బిచ్చగాళ్ళు లేని మన దేశ భాగ్యానికి వారికి కడుపుమండి ఉంటుంది. ఠాట్! ఎంతో అభివృద్ధి చెందిన మా దేశం (అమెరికా) లోనే బిచ్చగాళ్ళున్నారు, ఇక్కడలేకపోవడం ఏంటని బాగా మండి ఉంటుంది. దాంతోపాటు పుండుమీది కారం లా ఈ మధ్య ఇండియా తెగ అభివృద్ది చెందిపోయిందని అభివృద్ధిని కొలిచే ఫారిన్ పండితులు ఒకటే నస. వీటితో పాటుగా ఇరాక్ లో తాజాగా తోక కాల్చుకున్న బుష్హు గారికి దాంతోమండి, ఇదిగో ఇలా చిందులేస్తున్నట్టున్నాడు. అసలే అమెరికా అడుగులకు మడుగులొత్తే మన నాయకమన్యులు ఈ దెబ్బతో "మధ్యతరగతి హఠావో" (దాదాపు ౪౦ ఏళ్ళక్రితం ఎత్తుకున్న గరీభీ హఠావో లాగ) అనే నినాదం ఎత్తుకున్నా ఎత్తుకుంటారు. హాఠావో అన్నాంగదా అని మొత్తానికి మధ్యతరగతి జనాల్నే తరిమేస్తారేమో జాగ్రత్తండోయ్ జాగ్రత్త.

పూర్తి టపా చదవండి!

మే’ ఒకటి - ఆర్.ఎస్.ఎస్. డే

02 May, 2008

RSS Awareness Dayవెబ్ లోకం లోకి మరో కొత్త దినం వచ్చి చేరింది. మే నెల ఒకటో తారీఖు ఇప్పటిదాకా ’మే’డే మాత్రమే కానీ నెట్ జీవులకు మాత్రం ఇకనుంచి అది ఆర్.ఎస్.ఎస్ డే అవనుంది. ఆర్.ఎస్.ఎస్ అంటే రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రియల్లీ సింపుల్ సిండికేషన్ అనే దానికి సంక్షిప్త రూపమే ఆర్.ఎస్.ఎస్. దీనికోసం ఒక వెబ్ సైట్ ని తయారుచేసారు. ఆర్.ఎస్.ఎస్ గురించి మరియు ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలకు RSSDay ని చూడండి. ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టినవారు డైలీ బ్లాగ్ టిప్స్ అనే వెబ్ సైట్ వారు. మరిన్ని వివరాలకు ఆ సైట్ లోని స్ప్రెడ్ అనే సెక్షన్ లోకి వెళ్ళి చూడండి.

RSS Awareness Day

పూర్తి టపా చదవండి!

ముఖ్యమైన ఈ రెండు వార్తలు...

01 May, 2008

ఈరోజు (ది. 1-మే-2008) ఈనాడు దినపత్రిక లో కొద్దిగా ఏకాగ్రతతో చూడవలసిన విషయాలు రెండున్నాయి. ఒకటి "పార్టీల సమాచారం ప్రజల హక్కే" అనే శీర్షికతో ఉన్న వార్త, మరొకటి "ఎంపీలకూ లక్ష్మణ రేఖ" శీర్షిక తో ఉన్న వార్త.
పార్టీల సమాచారం ప్రజల హక్కే: ఈ చట్టం ద్వారా రాజకీయపార్టీలకు పార్టీ ఫండ్ లు ఎక్కడినుండి వచ్చాయో ఐ.టీ. డిపార్ట్మెంట్ ద్వారా మనం తెలుసుకునే వీలుంది. మనలాంటి వాళ్ళం తెలుసుకునీ ఉపయోగం ఏముంటుంది లేండి కానీ దీని ముఖ్యౌద్దేశం ఏమిటంటే రాజకీయాల్లో నల్లడబ్బుని అరికట్టడం. కానీ రాజకీయ పార్టీల నల్ల డబ్బుని ఈ హక్కు ద్వారా ఎలా ఎదుర్కోగలమో నాకర్ధంకావడంలేదు. ఎవరైనా గానీ లోక్ సత్తా ఎప్పటినుండో దీన్ని గురించి చెబుతోంది. తమ తెల్లడబ్బునే ఐ.టి. రిటర్న్స్ లలో చూపిస్తారు గానీ నల్లడబ్బుని కాదు. అలా వచ్చిన నల్లడబ్బునే ఎన్నికల్లో కుక్కలకు బిస్కట్లు వేసినట్టు ప్రజలకు వెదజల్లుతారు లేదా ఏ పేపర్ ఫ్యాక్టరీనో లేదా ఏ మాల్ లాంటివో పెట్టుకుంటారు. వారిని అడిగేదెవరు అడిగినా చెప్పేదెవరు. సత్ఫలితాలనిస్తుందో చెప్పలేం కానీ నిస్సందేహంగా ఇది ఒక మంచికి మొదలు అనుకోవచ్చు. ఈ నిర్ణయం వలన రాజకీయాలకు ఏదైనా మేలుజరుతుంది అని మీరనుకుంటున్నారా?


ఎంపీలకూ లక్ష్మణ రేఖ: లోక్ సభ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎం.పి. లను శిక్షించాలని లోక్ సభ హక్కుల సంఘం పార్లమెంటుకు సిఫార్సు చేసిందట. ఆ నియమావళిని ఉల్లంఘించిన వారికి 4 అంచెల శిక్షలు విధిస్తారట.
౧. మందలించడం
౨. చీవాట్లు పెట్టడం
౩. నిర్ణీత కాలంపాటు నిషేధించడం
౪. బహిష్కరించడం
నా ఉద్దేశంలో పై నాలుగింటికీ వలన పెద్దగా ఉపయోగంలేదు ఎందుకంటే అవి ఎం.పి ల అవినీతిని ఆపలేవు . వాటితో పాటుగా వారి ప్రవర్తన IPC క్రింద నేరమైతే చట్టప్రకారం చర్యకూడా తీసుకోవచ్చట. ఇదెంతవరకూ సాధ్యమో ఆలోచించండి. ఇప్పటికే శాసన వ్యవహారాలలో చట్టం తలదూరుస్తుందని పెద్దతలకాయలన్నీ వాపోతున్నాయి. పైన చెప్పిన వాటిలో "బహిష్కరించడం" అంటే కేవలం సభనుండి శాస్వతంగా పంపించడమా లేక ఎం.పి గానే తొలగించడమా? ఆ సభ్యులను ఎం.పి లుగా తొలగించడమే కాక వారుగానీ వారి కుటుంబసభ్యులుగానీ మళ్ళీ కొన్నేళ్ళ పాటు రాజకీయాల్లోకి రాకుండా నిషేధించే చట్టం ఉంటేనే ఇలాంటివాటికి చెల్లు చీటి. ఈ కొత్త నిర్ణయం తో ఎం.పి లలో అవినీతి పోతుందని మీరనుకుంటున్నారా?

పూర్తి టపా చదవండి!

మీ బ్లాగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంది?

తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఇప్పటికే బ్లాగులోకంలో మకుటం లేని మహారాజులైతే ఈ టపా మీకోసం కాదు ఎందుకంటే నేనుచెప్పబోయే విషయం మీకు ఇప్పటికే తెలుసు. సాధారణంగా గూగుల్ అనలిటిక్స్ ద్వారా నా బ్లాగ్ పరిస్థిని తెలుసుకుంటుంటాను. నిన్న అనుకోకుండా GetClicky అనే ఈ సైట్ ని చూశాను. కొన్ని విషయాలలో ఇది గూగుల్ అనలిటిక్స్ కన్నా మెరుగు అనిపించింది. గూగుల్ చూపించే విశ్లేషణ అంతా బాగానే ఉంటుంది కానీ మరీ తికమకగా ఉంటుంది. కొన్ని లింకులకి వెళితే మనం మొదట ఏ లింకు నుండి వచ్చామకూడా మర్చిపోతాం. GetClicky లో నాకునచ్చిన కొన్ని ఫీచర్స్ ఏమిటంటే "వెబ్ 2.0 ఇంటర్ ఫేస్", "డాష్ బోర్డ్ చాలా సింపుల్ గా ఉంది", "సులభంగా వాడుకోవడానికి వీలుగా పైన ఇచ్చిన మెనూ బార్", "మన వెబ్ సైట్ ని ఎవరెవరు చూస్తున్నారో ఆ వివరాలు (రియల్ టైమ్ లో, ప్రక్క నున్న బొమ్మ చూడండి)" ఇంకా మరెన్నో. ఈ సైట్ ట్రాకింగ్ కోడ్ జావాస్క్రిప్ట్/నాన్ జావాస్క్రిప్ట్ లలో లభిస్తుంది. వర్డ్ ప్రెస్ లాంటి బ్లాగ్ సైట్ లను దృష్టిలో ఉంచుకుని ఈ నాన్ జావాస్క్రిప్ట్ వెర్షన్ ని సృష్టించారు. కొన్ని స్క్రీన్ బొమ్మలను ఇక్కడ ఇచ్చాను చూడండి.
మరికొన్ని ప్రముఖ ట్రాఫిక్ అనాలసిస్ టూల్ సైట్ లు:
గూగుల్ అనలిటిక్స్
ఐస్ రాకెట్
సైట్ మీటర్
స్టాట్ కౌంటర్
గెట్ క్లికీ
గోస్టాట్స్

పూర్తి టపా చదవండి!

నేడే ’మే’ డే - యాహూ ఇమేజ్ సెర్చ్ స్పెషల్

సందర్భానికి తగినట్టుగా లోగో ని మార్చడం లేదా ఏదోఒక ప్రత్యేకతని చూపడం గూగుల్ కి ఉన్న అలవాటు. కానీ ఈ మే డే కి ఎందుకో అది ఈసారి ఏ ప్రత్యేకతా చూపలేదు. కానీ యాహూ ఇమేజ్ సెర్చ్ కి వెళ్ళి "may day" అని కొట్టి చూస్తే వచ్చిన రిజల్ట్స్ కొత్తగా ఉన్నాయి. ఈవిధంగా మరే కీవర్డ్ ఇచ్చినా రావడంలేదు. మేడే సందర్భంగా ననుకుంటా లేదా ఇంతకు ముందే వచ్చిన దానిని నేనే ఆలస్యంగా గమనించానేమో! మీరేమైనా ఇంతకుముందే దీనిని గమనించారా?

పూర్తి టపా చదవండి!

బ్లాగ్ సమస్యలు: విహారిని చూద్దామంటే పలకరించిన సర్వర్ ఎర్రర్

ఈ రోజు విహారి బ్లాగ్ సర్వర్ లో ఏదో సమస్య ఉన్నట్లుంది. కూడలి ద్వారా వెళ్ళి అక్కడ కనిపించిన "విహారి.: కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1" అనే లింక్ మీద నొక్కినప్పుడు నాకువచ్చిన ఎర్రర్ మెస్సేజి ని చూడండి. ఇది ఇప్పటికి రెండుసార్లు పలకరించింది. బహుశా సర్వర్ కి లోడు ఎక్కువైవుండవచ్చు. విహారి గారి విశ్లేషణ కోసం ఆ వచ్చిన ఎర్రర్ ని క్రింద అంటించాను . అయినా విహారి వెబ్ సైట్ చిరునామా ఇస్తే గూగుల్ ఎర్రర్ ఎందుకు వచ్చిందో!

పూర్తి టపా చదవండి!