సమాధానం తెలిసీ చెప్పకపోయావో...

02 June, 2008

తెలంగాణ ఉపఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కొందరు ఖుషీతోనూ, మరికొందరు విరక్తితోనూ, మిగిలిన వారు అయోమయంతోనూ ఎలక్షన్ల సమయంలో మిగిలిన సీసాలెత్తుతున్నారని వినికిడి. అదేటైంలో తామపరిస్థితికి కారణం ఏంటని బేరీజువేసుకుంటున్నవారూ ఉన్నారు. ఒకరి కారు పంక్చరాయె... కొన్ని బండ్లు ఓడలాయె, అందరికీ అంతా అయోమయం!

జై తెలంగాణా అంటూ రయ్యిమంటూ 100 కి.మీ వేగంతో దూసుకెళ్ళాల్సిన కారుకి ట్రబులొచ్చి ముక్కుతూ మూల్గుతూ ఎలాగో ఆదరికి చేరుకుంది. బండి ఎందుకు ఫెయిలయ్యిందో ఎవరికీ తెలియదు. , ఇంజిన్ వేడెక్కిందా లేక టైరు పంక్చరయిందా ఒకవేళ అయితే ఏ టైరుకి చిల్లుపడింది, ఏ కారణం చేత, రిపేరు అవుతుందా? లేదా?, అయితే ఎంత టైం పడుతుంది వగైరా తేలడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా బండి ట్రబులివ్వడానికి కారణం తానేనని భావించిన డ్రైవరు బాబు, తాను ఈ డ్రైవరు ఉద్యోగానికి రాజీనామా చేసిపాడేస్తానని ఉబలాటపడుతున్నాడు. ఈ కారు మీద నమ్మకం లేని కొంతమంది ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.

తెలంగాణాకి వ్యతిరేకంకాదు అంటూ ఎలక్షన్ల ముందు చేసిన కసరత్తు బాగా పనిచేసి చెయ్యికి బాగా కండ పట్టింది. "హస్త"లాఘవం తో బండిని విజయ తీరానికి చేర్చింది. ఇంతకీ వీరి దూకుడికి కారణం పధకాల అనుకూల వోటేనా లేక "అనుకూల" శక్తులా? లోగుట్టు పరుమాళ్ళకెరుక, నలుగురితో పాటు నారాయణ... వైఎస్ తోపాటే ఓకే అంటే పోలా. ప్రభుత్వ పధకాల అమలుకి ఉబ్బి తబ్బిబ్బై పడిన ఓట్లవి.

డొక్కు సైకిల్ అన్నారు. రిపేరుచేసినా మరో ఐదేళ్ళ వరకూ పనికిరాదన్నారు. కానీ ఎన్నికలముందు పెట్టిన గ్రీజు, చేసిన ఆయిలింగ్, కొట్టిన గాలి బాగా పనిచేసినట్టున్నాయి. రయ్యి రయ్యి మని పరిగెట్టి తొక్కేవోడి పరువు నిలబెట్టింది. అదంతా తానుపెట్టిన గ్రీజు మహత్యమే, కొట్టిన గాలి ఫలితమే అనుకుంటున్నాడు. పనిలో పనిగా తానూ తెలంగాణాకి వ్యతిరేకం కాదన్నాడు.

ఇంతవరకూ కధ చెప్పిన భేతాళరావ్, విక్రమరావ్ తో ఇలా అన్నాడు "ఒరే విక్రమ్ ఈ కధలో నాకు వచ్చిన అనుమానాలను తెలిసీ తీర్చకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది" అంటూ తన అనుమానాలను ఈవిధంగా వెల్లడించాడు.

కారుకి ట్రబులెందుకొచ్చింది? తెలంగాణాకి అందరూ అనుకూలమైతే ఇక వ్యతిరేకించేది ఎవరు? సెంటిమెంటు వుందా లేదా? ఇది అభివృద్ధికి పడినవోటా? "మీకోసం" కి పడినవోటా? "తెలంగాణాకి వ్యతిరేకంగాదు" అన్న నినాదంతో చెయ్యి, సైకిలు ప్రజల్ని మోసం చేశాయా? ఈ ఎన్నికల్లో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు? ఈ ఎన్నికలు ఫలితాలను బట్టి వచ్చేఎన్నికల్లో ఎవరు గెలవొచ్చు? అందరి సభలకి ప్రజలెందుకు హాజరవుతున్నారు? ... ... ... ... ... ... .

4 comments:

పుల్లాయన said...

mee bhethaludi kada bahu baagundi.... inthaki loksatta ki enni votes vachayo kanukkunnara mari?

bojja.vasu said...

మీ విశ్లేషణ చాల బావుంది.
ఈ ఎన్నికల్లో గెలిచింది ఎవరు: తెలంగాణ వోటర్లు
ఓడింది ఎవరు? :స్వార్డ రాజకీయులు
స్వార్ధ పర రాజకీయులకి చెంపపెట్టులాంటి తెలివయిన తీర్పు నిచ్చిన తెలంగాణ వోటర్లందరికి అభినందనలు.
మీ భేతాలుడి కథ బాగుంది.
ఇంత మంచి టపా వ్రాసి నందుకు మీకు నా అభినందనలు.

Chaks said...

పుల్లాయనకి, వాసు గారికి నెనర్లు. లోక్‍సత్తా కి సంబంధించి మరో టపా వ్రాద్దామని ఆగాను.

Chaks said...

పుల్లాయన గారికి: లోక సత్తాకి 80000+ ఓట్లు వచ్చాయట. అందులో ఖైరతాబాద్ లో 58407, తెర్లాం లో 13583 వచ్చాయట.