కంచికి చేరిన చెంపదెబ్బ కధ - భజ్జీకి స్వల్ప శిక్షతో సరి

14 May, 2008

అనుకున్నట్టుగానే ఐ.పి..ఎల్ యాక్షన్ హీరో హర్భజన్ సింగ్ 5 వన్డే మ్యాచ్ ల స్వల్ప నిషేధంతో బయటపడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఒక 20-20 మ్యాచ్ చివరలో అన్న లాంటి భజ్జీ తన తమ్ముడి లాంటి శ్రీశాంత్ ప్రవర్తన బాగోక సరదాగా చెంపదెబ్బ కొట్టాడంట. మొదట తమ్ముడు ఈ విషయంలో బాధపడినప్పటికీ తరువాత కొట్టింది అన్నలాంటి భజ్జీ నేగదా అని సర్దుకుపోయాడంట. వాడు సర్దుకుపోయినా అంతర్జాతీయంగా డేగకళ్ళతో ఈ విషయాన్ని చూస్తున్న వారిని బుజ్జగించడానికి బి.సి.సి.ఐ పెద్దలు ఏదోఒకటి చేయాలిగా. అందుకని ఒక కమీషన్ లాంటిది ఏర్పాటు చేసారు. ఈ విషయంలో నానావతి కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బి.సి.సి.ఐ ఈ నిషేధాన్ని విధించిందట. ఇప్పటికే ఐ.పి,.ఎల్ లో 11 మ్యాచ్ ల నిషేధం ఉంది (డబ్బుల్లో కోతేంలేదండి, ఐ.పి.ఎల్ లో పేరున్నందుకు మామూలుగానే ఫీజు ముడుతుంది). అసలైతే నిబంధనల ప్రకారం జీవితకాల నిషేధానికి గురికావలసిన వాడు అదృశ్య శక్తులపుణ్యమా అని అతి తక్కువశిక్షతో సరిపెట్టుకున్నాడు. ఆ శిక్షకూడా పడకపోవును కానీ ఆ మాత్రం లేకపోతే అంతర్జాతీయంగా పరువుపోతుందేమోనని భయపడి ఇచ్చినట్టున్నారు. ఈ మొత్తం ప్రహసనంలో వెర్రివెంగళాయలు ఎవరైనా వున్నారంటే వాళ్ళు ప్రేక్షకమహాశయులే. వారికి ప్రతీదానికీ ప్రతీదానికీ ఓవర్ గా రియాక్ట్ కావడం ఒక అలవాటు. అప్పుడెప్పుడో శిల్పాశెట్టి వ్యవహారం తరువాత ఆస్ట్రేలియా లో భజ్జీ vs సైమండ్స్ విషయం తరువాత ఇప్పుడు భజ్జీ vs శ్రీశాంత్ వ్యవహారం. శిల్పాశెట్టి, సైమండ్స్ వ్యవహారాలు మరీ దారుణం, వాటిని ఒక జాతికి వచ్చిన సమస్యలుగా మార్చేశారు. ఇప్పుడు భజ్జీ విశ్వరూపం చూసిన వాళ్ళకి అప్పుడు సైమండ్స్ చెప్పిన మాటల్లో యధార్ధముందేమోనన్న చిన్న సందేహం రాకమానదు.

0 comments: