అక్షరాల్లో నా కార్టూన్

24 May, 2008

అదేంటి కార్టూన్ గీతల్లో కదా ఉండేది, అక్షరాల్లో వుండడం ఏంటి అనుకుంటున్నారా? నేను కూడ కార్టూన్ వెయ్యడం నేర్చుకుందామని చాన్నాళ్ళనుండి అనుకుంటున్నాను. కానీ ఇప్పట్లో కుదిరేలా లేదు. దానికి సవాలక్ష కారణాలు. పోనీ ఎలాగోలా కొడదామంటే ఈ విషయానికి ముఖంలో భావం లేకపోతే బాగోదు. అందుకనే మనసులో కార్టూన్ పురుగు తొలిచినప్పుడల్లా దానిని దాచుకోకుండా కక్కేయడానికి ఒక సులభమార్గం కనిపెట్టాను. అదే కార్టూన్ థీమ్. అంటే నా మనస్సులో కార్టూన్ ఎలా వుండాలనుకున్నానో దానిని వర్ణించిచెప్పడం. ఔత్సాహికులకు ఎవరికైనా నచ్చితే ఆ థీమ్ తో బొమ్మ వేసుకోవచ్చు.

ప్రస్తుత బ్లాగ్వనంలో నలుగుతున్న విషయం సాక్షి గురించే. అందుకనే నా మొదటి కార్టూన్ (నా బ్లాగులో చివరిది కాకూడదని నా ప్రార్ధన) సాక్షిగురించే.

ఈ మధ్య సాక్షి ఏదినిజం పేరుతో ఈనాడుని చీల్చి చెండాడుతుంది కదా. మొన్నామధ్య పోలేపల్లి సెజ్ గురించి, నిన్న అదేదో ఆహార ఉత్పత్తి గురించిన నివేదికగురించి. భవిష్యత్తులో రాబోయే మరికొన్నింటి గురించి... ఇక నే మొదలెడతాను... మీరు ఊహించుకోండి...

ఒక గదిలో ఒక కుర్చీ మరియొక బల్ల, బల్ల మీద వెలుగుతున్న టేబుల్ లైటు.
ఆ కుర్చీ మీద కూర్చుని ఒకవ్యక్తి కునికిపాట్లుపడుతూ ఈనాడు పేపర్ చదువుతుంటాడు, ఆయన కళ్ళు సగం నిద్రతో మూసుకుని, సగం తెరచుకొని ఉంటాయి (అరమోడ్పు కనులన్నమాట)
ఆ బల్లకి నలువైపులా పేపర్లు దొంతర్లు దొంతర్లుగా పేర్చి ఉంటాయి, ఆ దొంతర్లు దాదాపు పైకప్పుని తాకుతుంటాయి.
గుమ్మం దగ్గర ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఈ విధంగా అంటుంటాడు "మన జగన్ గారే సార్, గత పదేళ్ళ ఈనాడులో తప్పుల కోసం వెతుకుతున్నారు"

3 comments:

sujata said...

chaaalaa bavundi.. mee theme.

bojja.vasu said...

:-)

vikatakavi said...

cool, good one, bommalu tagilimcaTamE taruvaayi.