"మళ్ళీ అధికారం నాదే": నిన్న జరిగిన కాంగ్రేస్ పునరంకిత సభలో మఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ అన్నమాటలివి. డైరెక్ట్ గా "నాదే" అనకపోయినా దాని అర్దం అదే కదా ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రేస్ అంటే మీరు, మీరంటే కాంగ్రేసే కదా. అయినా రాకూడదనడానికి మాకేం హక్కుంది? వై.ఎస్.ఆర్ గారు మీరన్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో కనీవినీ ఎరుగనంత అభివృద్ధి జరుగుతుంది.ఆయన గురించి ఆయనే ఒకానొక సందర్భంలో చెప్పుకున్నట్లు ఇది దేవుడి పాలన, దేవుడు ఆశీర్వదించిన పాలన, సాక్షాత్తూ ఆ దేవదేవుడే ఈ రక్షకుడి రూపంలో వచ్చి మనజన్మని చరితార్ధం చేసాడు. తెలియని వెర్రి జనాలు ఏదో అంటుంటారు మీలాంటివారు (వై.ఎస్.ఆర్) వీటిని పట్టించుకోకూడదు. నిజమే సార్ సామాన్యులు ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమందైతే తట్టుకోలేక గుండాగి, పోతున్నారుకూడా. దానికి మీరేం చేయగలరు చెప్పండి, దేవుడి పాలన చూసే అదృష్టం వాళ్ళకిలేదు. ఈరాష్ట్రానికి మీరెన్ని చేసారో ఓసారి ఈ జనాలకి గుర్తుచేద్దాం రండి. మీరు వాగ్ధానం చేసినట్టుగానే రైతులకు ఉచిత కరంటు ఇచ్చారు (గిట్టనివారు విద్యుత్ తీగలమీద బట్టలారేసుకుంటే మీరేంచేయగలరు), వేలకోట్ల రైతురుణాలు మాఫీచేసారు (అయినా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరేం చేయగలరు, అయినా దాని కోసం మీరడిగింది కేవలం వారి భూమినేకదా, ఇచ్చేస్తే పోయేదానికి ఆత్మహత్యలవసరమా?), లక్షలకోట్ల రూపాయలతో జనయఙ్ఞం చేశారు (గిట్టనివాళ్ళు ధనయఙ్ఞం అని ఆడిపోసుకుంటుంటే మీరేం చేయగలరు?). మీ నిజాయితీ గల ప్రభుత్వానికి వామపక్షాలే మీ చెంతచేరాయి, పొగిడయి ( నాలుగేళ్ళు కాపురం తర్వాత వాళ్ళే రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని
మీచేతికే చెయ్యిస్తే మీరేంచేయగలరు తిట్టడంతప్ప?). ఉచితపధకాలకి మరియు ప్రజా (పార్టీ) సేవకు డబ్బుకోసం సెజ్ పేరుతో భూములమ్మితే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఈ జనాల లొల్లేంటో? "ఉచితం" అనగానో పొలో మని ఓట్లేసే ఓళ్ళు ఇలాచెయ్యకపోతే ఈ ఉచిత పధకాలకు డబ్బులెక్కడనుండి వస్తాయో ఆలోచించక్కరలేదా? మీ ప్రభుత్వ అవినీతి మీరు చెప్పినట్లు గత ప్రభుత్వంకన్నా ఎంతో తక్కువని, ఈ రాష్ట్రం లో జరిగే నేరాలు బీహార్ కన్నా ఎంతోనయమని ఎందరికి తెలుసు? ఎన్నో ప్రజా ప్రయోజనాల విషయాలలో ప్రజలే మిమ్మల్ని అర్ధం చేసుకోకపోతే మీరెంత బాధపడ్డారో వాళ్ళకేం తెలుసు? మీగొప్పతనాన్ని మాత్రమే ప్రజలచెంతకు చేర్చకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని ఒక పత్రికాధిపతిని శిక్షిద్దామని శక్తివంచలేకుండా కృషిచేస్తుంటే రచ్చచేస్తున్నవాళ్ళనేమనాలి? ఇకలాభంలేదని మీ గొప్పతనాన్ని మీరే చాటుకోవడానికి కష్టపడి "సేకరించిన" డబ్బుతో పత్రిక పెట్టుకుంటే దానిని విషపుత్రిక అని కాంగ్రేస్ కరపత్రమని అంటారా ఎంతధైర్యం. ప్రజల కష్టాల్ని చూడలేక ఎంతో నీతితో నిజాయితీతో రోజుకి లక్షలకొద్దీ నష్టాలనుకూడా లెక్కచేయకుండా ప్రజాప్రయోజనాలకోసం పేపరుని రెండురూపాయలకే ఇస్తుంటే దానిని పట్టుకుని నల్లడబ్బుతో నడిపే పేపరని అంటారా(నల్లడబ్బైతే మాత్రం కష్టపడకుండా వచ్చిందా)? పేదలకోసం (వాళ్ళ ఓట్లకోసం) కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందిస్తుంటే దానిని తమ సొంతపధకమని అప్పోజిషనోళ్ళు ప్రచారం చేసుకుంటారా? నాలుగేళ్ళక్రితం అడుక్కుతిన్న వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వరులైంది ఈ పాలనలోనేగదా, ఫోర్డ్ వాళ్ళు సరిగ్గా సర్వే చెయ్యలేదుగానీ , చేసుంటే ప్రపంచం లో టాప్ 10 కోటీశ్వరులు మనరాష్ట్రం నుండే వుండేవాళ్ళు, అదీ మీ పుణ్యమేగా? ప్రజల్లో ఒకడిగా మీ ఇడుపులపాయ ఎస్టేట్ ని అభివృద్ది చేసుకుంటే దానినీ తప్పుపడతారా దానివలన ఎంతమంది కూలీలు ఉపాధిపొందుతారో వాళ్ళకు తెలియదా? పైగా సొంతలాభంకోసం జీ.వో.లు తెచ్చుకున్నారని అభాండాలు వేస్తారా? అంతే సార్ మంచికి రోజులు కావు. మీరన్నుకున్నట్లు గానే దేవుడి పాలనని ప్రజలు మర్చిపోకుండా తగిన బహుమతిని వచ్చే ఎన్నికలలో ఇస్తారని ఆశిద్దాం.[కార్టూన్ బొమ్మ: ఈనాడు పేపర్ నుండి తీసుకోబడినది, హక్కులేమైనా ఉంటే ఈనాడు మరియు శ్రీధర్ గారివే]





3 comments:
రామోజీకే గతి పట్టిందో చూసికూడ వైఎస్ గురించి ఇలాంటివి రాస్తారా? ఈ బ్లాగు ఉండవల్లి కంటబడిందంటే ఇంకేమన్నా ఉందా? అప్పుడే జగన్ సాక్షి పేరుతో పూర్తి రంగుల బ్లాగు ప్రారంభించే ఆలోచన్లో ఉన్నాడట. మొదటి రోజు క్లిక్కులే పన్నెండు లక్షలుండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. దానికోసం రాష్ట్రంలో ఛోటా మోటా కాంగ్రెసు లీడర్లందరికీ ఓ కంప్యూటరు, నెట్ కనెక్షనూ కూడా ఇప్పించారట. కాస్కోండి మరి.
http://anilroyal.wordpress.com
marE, mIru chAlA jAgrattagA uMDAlEmO.
sAksHi blAgA? bAguMdi
computer eM kharma laptapE istADu aMdarikI, "rAjIv ucita laptap padham" ani pEru peDatADA?
@అబ్రకదబ్ర:
భయపెట్టేస్తున్నారుగా!
జగన్ బ్లాగొస్తే ఇంక మనం దుకాణం బంద్ చేసుకోవల్సిందేనేమో!
Post a Comment