ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు కారణం మనమే నని మకుటం మాత్రమే తక్కువైన బుష్ చక్రవర్తిగారు సెలవిచ్చారు. మనవాళ్ళంతా తెగ తిని ప్రపంచానికి తిండిగింజలు లేకుండా చేస్తున్నామని ఆయన ఉద్దేశమట. ఈమధ్య మన మధ్యతరగతి ప్రజల కొనిగోలు శక్తి పెరగడమే ఈ ధరల పెరుగుదలకి కారణం అని ఆయన సూత్రీకరణ. ఆయన గారి బాధని కొద్దిసేపు పక్కన బెట్టి అసలు మనదేశంలో ధరలు పెరగడానికి మన ప్రభుత్వాలెంత కారణమో చూద్దాం. ఈ విషయంలో నాకు కొన్ని ప్రభుత్వ విధానాలమీద అనుమానం ఉంది. వాటిని మీ ముందు ఉంచుతాను.
బడాబాబుల చిల్లరకొట్లు: రాండి బాబూ రండి చవక బాబూ చవక అంటూ ఈమధ్య మన దేశంలో కొత్త కొత్త "మాల్స్" (ఎయిర్ కండిషనింగ్ తో, ఆధునిక హంగులతో) పుట్టుకొస్తున్నాయి. జనాలు చిల్లర కొట్లకి వెళ్ళడం బాగా తగ్గించేశారు. రైతు పొలం నుండి పంట నేరుగా మాల్స్ గిడ్డంగులలోకి పోతుంది. ఈ నిల్వలు సాధారణంగా సంవత్సరానికి సరిపడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండవచ్చు కూడా. ప్రభుత్వాని ఈ విషయంలో ఎలాంటి లెక్కలూలేవు. ఇంకేముంది వారు ఆడిందే ఆట చెప్పిందే రేటు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని మాల్స్ అన్నీ రేట్లు తగ్గించకపోతే వారి గొడౌన్ లమీద దాడిచేస్తామని ప్రభుత్వం బెదిరించింది. దాంతో వారు రేట్లు కొంత తగ్గించాలని నిర్ణయించినట్టు పేపర్లలో వార్త వచ్చింది. అంటే ఆ మాల్స్ వాళ్ళు కావాలనే ఎక్కువధరకు అమ్ముతున్నట్టేకదా! ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండిఉంటే నిజంగానే దాడిచేసి వారిని దార్లో పట్టేది.
ఒకడికి మంచి మరొకరికి కీడు: ముఖ్యమంత్రి Y.S.R అధికారంలోకి రాగానే ఒకమాటన్నారు మీకందరికీ గుర్తుండే ఉంటుంది. అదేంటంటే మన రైతులు నెమ్మదిగా వ్యవసాయేతర ఉపాధులవైపు మళ్ళాలని ఎందుకంటే వ్యవసాయం అంతగా గిట్టుబాటు కావడం లేదని ఆయనన్నారు. ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అందరూ వ్యవసాయం మానేసి వ్యాపారాలు చేస్తే పంటపండించేదెవరు? కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలు కావా? మనకి కంప్యూటరెలాగో రైతుకి వ్యవసాయకూలీ అలాంటి వాడు. కూలీ లేకుండా రైతు వ్యవసాయం చెయ్యలేడు. పదేళ్ళ క్రితందాకా రైతుకి కూలీలు విరివిగా దొరికేవాళ్ళు. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పధకం వచ్చి రైతుల పొట్ట కొట్టిందని నా అభిప్రాయం. క్రితం ఏడాది మా పొలం కౌలుదారు మా దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి చెప్పుకుని బాధపడ్డాడు. అంతకుముందు వ్యవసాయ కూలీలు పనులకోసం రైతుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు రైతులు వ్యవసాయ కూలీలకోసం తిరిగే పరిస్థితి వచ్చింది. అలా తిరిగినా అదృష్టం ఉంటే గానీ వాళ్ళు దొరకడం లేదు అలాంటప్పుడు వ్యవసాయేతర కూలీలను తెప్పించుకుంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం మంచిదే దాని ఉద్దేశం పనులు లేనప్పుడు వారికి పని కల్పించడం కానీ ఎందుకనో ఆ పనులు చేసినవారి మళ్ళీ వ్యవసాయ పనులకు రావడం లేదు. ఇది వ్యవసాయానికి పెద్ద దెబ్బే.
సెజ్ చిచ్చు: రైతు తన పొలాన్ని కన్న బిడ్డలా చూసుకుంటాడు, ఆ పొలాన్ని అర్ధంచేసుకుంటాడు. దానికి ఏ సమయంలో ఏంకావాలో అవన్నీ అందిస్తాడు. మందులు చల్లినంతమాత్రాన పొలాలన్నీ బాగా పండితే మనకి తిండిగింజలకి ఏ కొరతా ఉండదు. అంత కష్టపడి సాగులోకితెచ్చి బంగారాన్ని (అన్నం, బంగారమే కదా!) పండించే పచ్చటి పంటపొలాల్ని "సెజ్" ల పేరుతో పారిశ్రామిక వేత్తలకి ధారపోసి రైతుల పొట్ట గొడుతున్నారు. వేలకు వేల ఎకరాల వ్యసాయ భూమి ఆవిరైపోతుంటే అది ఎవరికి నష్టం?
రైతు ఆత్మహత్యలు: ఏ పనికైనా అనుభవం చాలా అవసరం, వ్యవసాయం ఏమీ దీనికి అతీతం కాదు. చిన్నప్పుడు తండ్రితో పాటు పొలానికేళ్ళే దగ్గరినుండి తాను సొంతంగా వ్యవసాయంచేసే వరకూ రైతు నేర్చుకొంటూనే ఉంటాడు. మన ప్రభుత్వాల నిర్వాకాలవల్లనేమీ మరే కారణమైతే నేమీ చాలామాంది అనుభవమున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకుటుంబాలు కూలీలుగా మారుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకొని ఆ లోటు భర్తీచేసే వారేరి? మన కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే వెంటనే వారికి రీప్లేస్‍మెంట్ చూస్తాం అవసరమైతే ఆ కొత్తవాళ్ళకి శిక్షణ నిస్తాం. మరి ఈ రైతులకి రీప్లేస్‍మెంట్ జరుగుతుందా లేదా శిక్షణ ఉందా అని పట్టించుకునేవారేరీ?
మన ఆలోచనాసరళి: ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఆఫీసు భవనం ఒక సెజ్. దీనిలో ౨ వేలమంది పనిచేస్తున్నారు. అంటే ౨ వేలమందికి అన్నంపెడుతుంది అనొచ్చా? ఒక్కనిమిషం ఉండండి... ఈ భవనం భూమి ఉన్న ప్రదేశంలో అంటే దాదాపు ౧౦ ఎకరాలలో ఒకప్పుడు వ్యవసాయం చేసేవారు. అంటే ఆ ఫలసాయాన్ని మన దేశం కోల్పోయినట్టేగా! ఎకరానికి ౩౦ బస్తాల ధాన్యం వేసుకున్నా మొత్తం ౩౦౦ బస్తాల ధాన్యం మన కోల్పోయాం. ఇది దాదాపు ౧౦౦ కుపైగా కుటుంబాలకు సంవత్సరాని సరిపోతుంది. ఈ విధంగా వేల ఎకరాలు పోతే ఇక మన దగ్గర దబ్బున్నా కొనడానికి ధాన్యం ఏది? మరి రేట్లు పెరగక చస్తాయా? ఎవరూ కూడా అభివృద్ధి కి వ్యతిరేకం కాదు పరిశ్రమల ద్వారానే మనం అభివృద్ధి చెందాలనే అభివృద్ధి వాదులు ఆ పని జరిగిన తరువాతైనా ఈ రైతుల గురించి ఆలోచిస్తే ఎంతో మంచిది.
ఇవి నాకుతెలిసిన కొన్ని కారణాలు మాత్రమే కావచ్చు ఇంకా తెలియని కారణాలెన్నో...
ఒక దేశం మీద ఆంక్షలు విధించడానికి ముందో లేదా దాడిచేయడానికి ముందో ఈవిధంగా నోరుచేసుకోవడం అమెరికా వారి ఆచారం. మరి ఈ నోటి దురద వెనకున్న కధేమిటో ముందుముందు తెలియొచ్చు.
చివరగా.... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు మన హైదరాబాదు వచ్చారు. వారికి మన వాళ్ళ దరిద్రం చూపిస్తే బాగోదని హైదరాబాదులోని బిచ్చగాళ్ళందరినీ తరిమేశారని అప్పట్లో పేపరోళ్ళు కోడైకూశారు. బిచ్చగాళ్ళు లేని మన దేశ భాగ్యానికి వారికి కడుపుమండి ఉంటుంది. ఠాట్! ఎంతో అభివృద్ధి చెందిన మా దేశం (అమెరికా) లోనే బిచ్చగాళ్ళున్నారు, ఇక్కడలేకపోవడం ఏంటని బాగా మండి ఉంటుంది. దాంతోపాటు పుండుమీది కారం లా ఈ మధ్య ఇండియా తెగ అభివృద్ది చెందిపోయిందని అభివృద్ధిని కొలిచే ఫారిన్ పండితులు ఒకటే నస. వీటితో పాటుగా ఇరాక్ లో తాజాగా తోక కాల్చుకున్న బుష్హు గారికి దాంతోమండి, ఇదిగో ఇలా చిందులేస్తున్నట్టున్నాడు. అసలే అమెరికా అడుగులకు మడుగులొత్తే మన నాయకమన్యులు ఈ దెబ్బతో "మధ్యతరగతి హఠావో" (దాదాపు ౪౦ ఏళ్ళక్రితం ఎత్తుకున్న గరీభీ హఠావో లాగ) అనే నినాదం ఎత్తుకున్నా ఎత్తుకుంటారు. హాఠావో అన్నాంగదా అని మొత్తానికి మధ్యతరగతి జనాల్నే తరిమేస్తారేమో జాగ్రత్తండోయ్ జాగ్రత్త.





3 comments:
మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.అవును ''మధ్యతరగతి హటావో'' అనగలిగిన నిక్రుష్టులు ఉన్నారనటములో సందేహము లేదు.
ఏమీ అనుకోకండి. ఇప్పటిదాకా రైతులకోసం ప్రభుత్వం అవసరమైనదానికన్నా చాలా చాలా ఎక్కువే చేసిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ మాట అన్నంతమాత్రాన ఎవరూ రైతులోకానికి శత్రువులుగా చూడబడనక్కఱలేదు. వాస్తవానికి గత ౬ దశాబ్దాలుగా వ్యవసాయం నుంచి ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయమూ లేదు. ఇంకా ఇంకా ఏదో చెయ్యాలని ఆశించదం భావ్యం కాదు. ఆ చేసింది రైతులకు సరిపోకపోతే దానిక్కారణం రైతులే. మన రైతులకు చదువుసంధ్యల్లేవు. అదొక అంగవైకల్యం లాంటి పరిస్థితి.
రోజురోజుకూ పెద్దవవుతున్న రైతుకుటుంబాలకు ౫-౧౦ ఎకరాల చిన్న కమతాలు పూర్వం మాదిరి ఆసరాగా నిలవలేవు. ఈ పరిస్థితిని మార్చాలంటే రైతుకుటుంబాలకు వ్యవసాయేతర ఉపాధిని చూపడం అవసరం. అందుకోసం వారిలో వ్యవసాయేతర నైపుణ్యాల్ని పెంపొందించడం కూడా అవసరం. అందుకని నేను వై.ఎస్ లేదా నాయుడుగార్ల వ్యాఖ్యల్ని తప్పుపట్టజాలను.
అయినా మనచేత ప్రత్యేకంగా చెప్పించుకో నవసరం లేకుండానే ఇప్పుడు వారిలో చాలామంది (ముఖ్యంగా యువతరం) వ్యవసాయేతర ఉపాధి వైపు మళ్ళుతున్నారు. మంచిదే.
సుబ్రహ్మణ్యం గారు: మీ అభిప్రాయం చెప్పినందుకు నెనర్లు. మీరుచెప్పింది కొంత కరక్టే. బహుశా మీరు రైతు రుణాల మాఫీ ని దృష్టిలో ఉంచుకుని అంటున్నట్లున్నారు. ప్రభుత్వం ఇప్పటిదాకా అమలుచేసిన పధకాల రాత లాగే దీని పరిస్థితి కూడా అవుతుంది. నిజంగానే ఇది అందరు రైతులకీ ఉపయోగపడుతుందనుకుంటున్నారా? నిజంగానే ప్రభుత్వం రైతులకి ఎంతోచేస్తే గత 10 సంవత్సరాలలో దాదాపు 3000 మందికి పైగా రైతుఆత్మహత్యలెందుకు జరుగుతాయి? ఇప్పటిదాకా మన దేశం, మన రాష్ట్రం ఆహార ఎగుమతి దారులు. మనం తినగా మిగిలిన ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో రైతులు వ్యవసాయం మానేసి మనం దిగుమతులకు పాల్పడితే మనం ఎంత డబ్బు పెట్టి వాటిని కొనుక్కోవాల్సి ఉంటుందో ఆలోచించండి.
ఇక ఆదాయం అంటారా అది ప్రభుత్వానికి ఎన్నో రూపాల్లో వస్తుంది. రైతులు ఆదాయ పన్ను తప్ప మనం చెల్లించే అన్ని పన్నులూ చెల్లిస్తున్నారు. ఈ మధ్య కడుతున్న ఎత్తిపోతల పధకాలలో రైతులు కూడా భాగస్వాములు అంటే వాళ్ళు పంటకీ నీరు కోసం కొంత డబ్బు చెల్లించాలి మిగతాది ప్రభుత్వం చెల్లిస్తుంది. ధాన్యం ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి విదేశీ కరెన్సీ వస్స్తుంది.
ప్రభుత్వ సబ్సీడీ ఎక్కడ లేదు? మనం వాడే గ్యాస్ (14kg) కి ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీ 500 రూపాయలు (ప్రస్తుత మార్కెట్ ప్రకారం బయటిధర 1000). ఆ మధ్య సచిన్ టెండూల్కర్ ఫేరారీ కారుకి టాక్శ్ ఎగ్జమ్‍షన్ ఇచ్చిందట. రైతుకివ్వడం లో తప్పేమైనా ఉందంటారా? భవిష్యత్తులో మరింత ఎక్కువధరలకి సరుకులు కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మీరుచెప్పినట్టు చిన్న కమతాలు అంతగా ఆసరా ఉండడం లేదు దానికి ప్రభుత్వం వేరే ఆలోచన చేయాలి. జలుబుచేసిందని ముక్కునే కోసేసుకుంటామా?
Post a Comment